ఫోన్ నంబరుతో వివరాలన్నీ తెలిసేలా సాఫ్ట్వేర్ రూపకల్పనదాని ద్వారా నిందితులకు ముకుతాడు
ఫలిస్తున్న టీజీసీఎస్బీ ప్రయత్నాలు
ఆరు నెలల్లో 36 వేల సిమ్‌లు బ్లాక్ చేయించిన అధికారులు
ఈనాడు, హైదరాబాద్: సైబర్ దొంగలపై అధికారులు ప్రయోగిస్తున్న సాఫ్ట్వేర్ అస్త్రం సత్ఫలితాన్నిస్తోంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు ఏ సాంకేతిక పరిజ్ఞానం అడ్డుపెట్టుకొని నేరగాళ్లు చెలరేగిపోతున్నారో అదే సాంకేతిక పరిజ్ఞానం అండతో వారికి ముకుతాడు వేస్తున్నారు. దేశంలో ఎక్కడ నేరం చేసినా నిందితుడి ఆచూకీ తెలుసుకోవడమే కాదు అతడికి సంబంధించిన సమస్త సమాచారం క్షణాల్లో సేకరించగలిగే సదుపాయం సమకూర్చుకుంటున్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) పనితీరుకు ప్రతిఫలంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రత్యేక అవార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సైకాప్స్’ పేరుతో చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వడంతో ఈ తరహా టూల్స్ మరిన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక్క క్లిక్‌తో మొత్తం తెలిసేలా..
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రాష్ట్రంలో పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి నేరాలకు పాల్పడుతుండడంతో వారిని గుర్తించడమే దర్యాప్తు అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీజీసీఎస్బీ సైబర్ నేరగాళ్లపై సాంకేతిక అస్త్రం ప్రయోగిస్తోంది. అధికారులు రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా మోసం చేయడానికి నేరస్థుడు వాడిన ఫోన్ నంబరును కంప్యూటర్లో నమోదు చేస్తే చాలు. ఆ నంబరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో తెలుస్తుంది. అంతేకాదు అది ఎవరి పేరుతో ఉంది, ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది, దాని ద్వారా ఎన్ని సామాజిక మాధ్యమ ఖాతాలు నడుపుతున్నారు, ఎన్ని బ్యాంకుల ఖాతాలు అనుసంధానమై ఉన్నాయి వంటి వివరాలన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి. ఒక్కసారి ఈ సమాచారం చేతికి వస్తే నేరగాడి ఆట కట్టించవచ్చు.
మళ్లీ నేరాలకు పాల్పడకుండా..
సాఫ్ట్వేర్ ద్వారా సేకరించిన వివరాలన్నీ కేసులు నమోదైన ఆయా రాష్ట్రాలతో పంచుకోవడం సాధ్యమవుతుంది. నిందితుడు ఎక్కడ పట్టుబడ్డా మిగతా రాష్ట్రాలు కూడా పీటీ వారెంటు మీద తీసుకెళ్లి విచారించి, తమ కేసులలోనూ అరెస్టు చూపించవచ్చు. దేశవ్యాప్తంగా ఇన్ని నేరాలకు పాల్పడ్డాడని న్యాయస్థానానికి చెప్పడం ద్వారా నిందితుడికి బెయిల్ రాకుండా చూడొచ్చు. తద్వారా సదరు నిందితుడు మళ్లీ నేరాలకు పాల్పడకుండా అడ్డుకోవచ్చు. సదరు సిమ్‌కార్డు, సామాజిక మాధ్యమాలు, బ్యాంకు ఖాతాలతోపాటు ఫోన్లు కూడా బ్లాక్ చేయించవచ్చు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకూ ఇలా 36,749 సిమ్‌కార్డులు, 8,300 ఫోన్లు బ్లాక్ చేయించారు. 671 మంది సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 77 వేల మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించగలిగారు. పోలీసులు కూడా కాలు కదపకుండా కేవలం సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఇది సాధించగలిగారు. అసలు నేరస్థుడు ఎవరో తెలియని స్థితి నుంచి అతడ్ని కట్టడి చేయగలిగే స్థితికి రాగలిగారు. ఒక సిమ్‌కార్డు బ్లాక్ చేస్తే మరో సిమ్‌కార్డుతో మోసానికి పాల్పడే అవకాశం ఉన్నా కనీసం నేరస్థులకు కొంత భయం అయినా ఏర్పడుతుంది. తద్వారా నేరాలను అడ్డుకోవచ్చనే ఆలోచనతో సీఎస్బీ అధికారులు ముందుకు వెళ్తున్నారు.