ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
చల్లపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రపత్రిక): విద్యార్థిని విద్యార్థులకు కేవలం విద్య చెప్పటమే కాకుండా వారి ప్రతిభకు గుర్తుగా ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహకాలే వారు మరింత ఉన్నతంగా ఎదగటానికి పెద్ద మార్పుకు నాంది అవుతాయని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆవిధంగా ముందుకు సాగుతూ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న చల్లపల్లిలోని విజయ క్రాంతి జూనియర్ కళాశాలను ఇతర కళాశాలలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శనివారం విజయ క్రాంతి జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు తడవకుల్లు నరసింహారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి, రెండవ సంవత్సరాలలో ప్రధమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి వరుసగా రూ.10116లు, రూ.5116లు చొప్పున వారి వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. రూ.10116లు నగదు బహుమతి పొందిన వారిలో డొక్కు లక్ష్మీ దుర్గ (ఎంపీసీ ఫస్ట్ ఇయర్), పేరం కీర్తి (ఎంపీసీ సెకండ్ ఇయర్), మిరియాల విజయలక్ష్మి (సిఇసి ఫస్టియర్), బస్సు కీర్తి (సిఈసి సెకండియర్)లు ఉన్నారు. రూ.5116లు నగదు బహుమతి పొందిన వారిలో వేమూరి సాయి సత్య హారిక(ఎంపీసీ ఫస్ట్ ఇయర్), రామావతుల జీవన(ఎంపీసీ ఫస్ట్ ఇయర్), మేడేపల్లి త్రివేణి(ఎంపీసీ సెకండ్ ఇయర్), నడకుదుటి మనోహ్య(సిఇసి ఫస్టియర్), గరికపాటి నందిని (సిఈసి సెకండియర్)లు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ పిల్లలకు విద్యతోపాటు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న విజయ్ క్రాంతి జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు దుట్ట ఉమామహేశ్వరరావు, కళాశాల కరస్పాండెంట్ దుట్ట శివప్రసాదులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని, విద్యార్థులు కేవలం విద్య పైనే దృష్టి కేంద్రీకరించకుండా సమాజం పట్ల, చట్టాల పట్ల, రాజకీయం పట్ల అవగాహన పెంచుకున్నప్పుడు వారు మరింత ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కళాశాలలో ఫేర్వెల్ పార్టీ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పిల్లలు స్టేజ్ మీద ఉత్సాహంగా తమ టాలెంట్ను ప్రదర్శించారు. స్టేజి ముందున్న విద్యార్థిని విద్యార్థులు తమ చప్పట్లతో ప్రోత్సహించారు.