ముAముదురు ఎరుపు మంచు స్ఫటికాలు, మంచు, వర్షపు చినుకుల సాంద్రతను సూచిస్తుంది
తుఫాను మేఘం లోపల (అంతర్గత నిర్మాణం) ఎలా ఉంటుందో మునుపెన్నడూ చూడని శాటిలైట్ చిత్రాన్ని యూరోపియన్ యూనియన్, జపనీస్ స్పేస్ ఏజెన్సీలు విడుదల చేశాయి.
దీనిని చిత్రించేందుకు వారి ఎర్త్కేర్ శాటిలైట్ డాప్లర్ రాడార్‌ను ఉపయోగించింది.
మేఘంలోని గడ్డకట్టిన మంచు, మంచు, వర్షం సాంద్రత ఎంత, అలాగే వర్షపు చినుకులు భూమిపై పడే వేగం వంటి విషయాలను ఈ డేటా వెల్లడిస్తుంది.
మేఘాలు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మరింత బాగా అర్థం చేసుకోవడం కోసం మే నెలలో నావెల్ ఎర్త్కేర్ మిషన్‌ను ప్రారంభించారు.
దాదాపు 850 మిలియన్ యూరోల(సుమారు 7,591 కోట్లు) ఈ స్పేస్‌క్రాఫ్ట్ అందించే సమాచారం వాతావరణ సూచనలను కూడా మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ స్పేస్‌క్రాఫ్ట్ తీసే చిత్రాలను రీసర్చ్ ప్లేన్స్, భూమిపై ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పొందవచ్చు. కానీ కక్ష్య నుంచి నేరుగా చిత్రాలను పొందడం సాధ్యం కాదు.
”ఎర్త్కేర్ నుంచి వచ్చిన మొదటి రాడార్ చిత్రాలను చూసి నేను ఆశ్చర్యపోయా. ఇప్పటి వరకూ చేస్తున్నట్లుగా కేవలం రాడార్ స్టేషన్ల నుంచి మాత్రమే కాకుండా, భూమిపై పడే మంచు స్ఫటికాలు, వర్షపు చినుకులు, హిమపాతం వేగాన్ని వేగంగా కొలవగలం” అని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) మిషన్ సైంటిస్ట్ డాక్టర్ రాబిన్ హోగన్ అన్నారు.
”ఇదో గొప్ప సాంకేతిక విజయం. రాడార్ ఎకోలో చిన్న డాప్లర్ షిఫ్ట్‌ను ఉపయోగించి సెకనుకు ఒక మీటరు వేగాన్ని మాత్రమే మనం అంచనా వేస్తున్నాం. కానీ, ఇది సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో తన కక్ష్యలో దూసుకుపోతున్న శాటిలైట్ నుంచి వచ్చింది” ఆయన బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
జపాన్‌కు తూర్పున పసిఫిక్ మహాసముద్రంపై ఉన్న మేఘాన్ని నమూనాగా తీసుకుని పరిశీలించారు.
ESAభూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఎర్త్కేర్ శాటిలైట్
వివిధ దశల్లో ఉన్న నీరు మేఘంలో ఎక్కడ ఉంటుందో ఈ చిత్రంలో చూడడం సాధ్యమవుతుంది.
మంచు స్ఫటికాలు, మంచు ఎత్తు నుంచి నెమ్మదిగా కిందకు పడుతున్నట్లు చూపుతున్నాయి. సుమారు 5 కిలోమీటర్ల ఎత్తులో స్పష్టమైన బోర్డర్ ఉంది. అక్కడ మంచు, మంచు స్ఫటికాలు కరిగి నీటి బిందువులుగా ఏర్పడి, వర్షంగా కురుస్తాయి.
మేఘంలోని వివిధ రకాల కణాల సాంద్రత, వాటి పరిమాణం, కదలికలను వివరించేందుకు మేఘాల నిర్మాణం, వాటి కదలికల గురించి భౌతిక శాస్త్రపరంగా మరింత స్పష్టమైన అవగాహన సాధ్యమవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
వేడెక్కుతున్న ఈ ప్రపంచంలో మేఘాల కచ్చితమైన పాత్రపై అవగాహన పొందడం కూడా వాటిలో ఒకటి.
కొంత తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చేయడం ద్వారా గ్రహాన్ని చల్లబరుస్తాయి. మరికొన్ని మేఘాలు ఎత్తైన ప్రదేశంలో దుప్పటిలా పనిచేస్తూ భూమిపై పడకుండా సూర్యరశ్మిని అడ్డుకుంటాయి.
ఆ సమతుల్య స్థితి కచ్చితంగా ఎక్కడుందో కనుగొనేందుకు ఎర్త్కేర్ మిషన్ ప్రయత్నిస్తోంది.
పెరిగిపోతున్న గ్రీన్హౌస్ వాయువులకు వాతావరణం ఎలా స్పందిస్తుందో అంచనా వేసేందుకు ఉపయోగించే కంప్యూటర్ విధానాల్లో ఇదో పెద్ద అనిశ్చితి.
”ఇది ప్రారంభం మాత్రమే” అని డాక్టర్ హోగన్ అన్నారు. ”ఎర్త్కేర్లో మరో మూడు పరికరాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అవి పని ప్రారంభిస్తాయి. రాడార్‌తో కలిసి, మేఘాల రహస్యాలు, వాతావరణ వ్యవస్థలో వాటి పాత్రను తెలుసుకునేందుకు వాటిని ఉపయోగిస్తాం” అన్నారు.
”ఈ ఎర్త్కేర్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు నాతో సహా చాలామంది 20 ఏళ్లుగా కష్టపడ్డాం. ఎట్టకేలకు, శాటిలైట్ డేటా పంపడం ప్రారంభించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది” అని ఆయన బీబీసీ న్యూస్‌తో అన్నారు.