Chinese Garlic : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయవాది అర కిలో చైనీస్ వెల్లుల్లితోపాటు మన దేశంలో ఉత్పత్తయ్యే సాధారణ వెల్లుల్లిని తీసుకుని కోర్టు హాల్‌కు వచ్చాడు.
దాంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇంతకూ ఆ లాయర్ వెల్లుల్లిని కోర్టు రూమ్‌లోకి ఎందుకు తీసుకొచ్చాడు..? జడ్జి ఎందుకు సీరియస్ అయ్యారు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం..
అసలు విషయం ఏమిటంటే.. మన దేశంలో చైనా వెల్లుల్లిపై నిషేధం ఉంది. 2014లో చైనా వెల్లుల్లి దిగుమతి, వాడకంపై నిషేధం విధించారు. అయినప్పటికీ ఇంకా మన దేశ మార్కెట్లో చైనా వెల్లుల్లి విరివిగా లభిస్తున్నది. ఈ విషయాన్ని ఆధారాలతో నిరూపించాలనే ఆ న్యాయవాది ఇలా చేశారు. భారత మార్కెట్లలో చైనా వెల్లుల్లి లభ్యత అంశాన్ని లేవనెత్తుతూ.. న్యాయవాది మోతీలాల్ యాదవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.
చైనీస్ వెల్లుల్లి లభ్యతను సీరియస్‌గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. యూపీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిని కోర్టుకు పిలిపించింది. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హానికరమైన ప్రభావాల కారణంగా 2014లోనే చైనా వెల్లుల్లిపై నిషేధం విధించినా ఇంకా మన మార్కెట్లోకి ఎలా వస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని భారత డిప్యూటీ సొలిసిటర్ జనరల్ సూర్యభాన్ పాండేని ఆదేశించింది.
అలాంటి వస్తువుల ప్రవేశానికి మూలాన్ని గుర్తించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుపాలని కోర్టు కోరింది. భారత మార్కెట్లో నిషేధిత చైనీస్ వెల్లుల్లి ఎగుమతి, అమ్మకాలపై విచారణ జరిపి దోషులుగా ఉన్న అధికారులు, ఇతర నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సీబీఐని ఆదేశించాలని న్యాయవాది యాదవ్ తన పిటిషన్లో కోరారు. దేశంలోకి ఫంగస్ సోకిన వెల్లుల్లి వస్తుందని వచ్చిన నివేదికల కారణంగా 2014లో భారత ప్రభుత్వం చైనీస్ వెల్లుల్లి దిగుమతిని నిషేధించింది.
అక్రమంగా తరలిస్తున్న వెల్లుల్లిలో పురుగు మందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో వెల్లుల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా. చైనీస్ వెల్లుల్లి పురుగు మందులు, రసాయనాలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుందని యాదవ్ తన పిల్లో పేర్కొన్నారు. అందువల్ల ఇది భారతదేశ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైందన్నారు. దేశంలో చైనా వెల్లుల్లి దిగుమతి, రవాణా, అమ్మకంపై నిషేధం ఉన్నప్పటికీ మన మార్కెట్లో అందుబాటులో ఉందన్నారు.