ఇంటర్నెట్‌డెస్క్: జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండిపోయినంత మాత్రాన విజయాలు సాధిస్తుందని చెప్పలేమని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు.
2025 సీజన్‌కు ముందు కొందరిని వదులుకోవాలని ముంబయి ఇండియన్స్‌కు సూచించాడు. ఓ ఆంగ్ల క్రీడా పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ”ఒక మాట చెప్పండి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఒకే సినిమాలో నటించినంత మాత్రాన అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అది బ్లాక్‌బస్టర్ కావాలంటే.. వారి ప్రదర్శన మంచిగా ఉండాలి. బలమైన స్క్రిప్ట్ అవసరం. అలానే ఈ పెద్ద స్టార్లు బాగా నటించాలి. రోహిత్ శర్మ శతకం కొట్టాడు.. అయినా ముంబయి ఓడిపోయింది. మిగిలిన వారి ఆట ఎక్కడ చెప్పండి..? ఇషాన్ సీజన్ మొత్తం ఆడాడు.. కానీ, ఎప్పుడూ పవర్ ప్లేను దాటి నిలబడలేదు. ఈ పరిస్థితిలో ముంబయి జట్టులో ఇద్దరి పేర్లు మాత్రమే నిశ్చయంగా కొనసాగుతాయి. అవి బుమ్రా, సూర్యా. ఆ జట్టు రిటైన్ చేసుకోనే ఆటగాళ్లు వీరిద్దరే” అని పేర్కొన్నాడు.
మరో మాజీ ఆటగాడు మనోజ్ తివారీ మాట్లాడుతూ సెహ్వాగ్‌కు మద్దతు తెలిపాడు. కేవలం సూర్య, బుమ్రానే రిటైన్ చేసుకోవాలని ముంబయికి సూచించాడు. ”ఎంఐ కేవలం బుమ్రా, సూర్యనే రిటైన్ చేసుకొంటుంది. విదేశీ ఆటగాళ్లు సహా మరెవరరికీ ఈ అవకాశం స్పష్టంగా కనిపించడం లేదు. టిమ్ డేవిడ్ కూడా అంచనాలు అందుకున్నట్లు అనిపించలేదు. నా సలహా ఏమిటంటే ఈ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకొని.. వీరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు అప్పగించండి. నేను రోహిత్‌ను ఉంచాలని కూడా అనను. అతడిని చూస్తే.. జట్టే తనని రిటైన్ చేసుకోవాలని అతడే కోరుకోనట్లు కనిపిస్తుంది” అని పేర్కొన్నాడు.
ఈ సీజన్లో ముంబయి జట్టు పగ్గాలు హార్దిక్‌కు అప్పజెప్పాడు. ఆ తర్వాత జట్టు ఆటతీరు ఘోరంగా పడిపోయింది. 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీనికితోడు జట్టులో విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నాయి. వ్యక్తిగతంగా హార్దిక్ ఆటతీరు కూడా దారుణంగా ఉండటంతో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.