నBCనజ్దానా విడాకుల పత్రాలతో అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయారు.
బీబీ నజ్దానా అనే యువతి కొన్ని పత్రాలను పట్టుకుని రెండు బిజీ రోడ్ల మధ్యలో ఉన్న చెట్టు కింద (ఒక పొరుగు దేశంలో) కూర్చున్నారు.
అవి ఆమె విడాకుల పత్రాలు.
ఆమెకు బాల్య వివాహం జరిగింది. అది ఆమెకు నచ్చలేదు. దాంతో, విడాకుల కోసం ఆమె రెండేళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి.
అయితే, తర్వాత ఇస్లామిక్ చట్టం (షరియా) కారణంగా నజ్దానా విడాకులను తాలిబాన్ కోర్టు రద్దు చేసింది.
అఫ్గానిస్తాన్ 2021లో తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి నజ్దానా కేసు వంటి వేలాది కోర్టు తీర్పులను తాలిబాన్లు రద్దు చేశారు.
తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న 10 రోజుల తర్వాత, నజ్దానాకు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలంటూ ఆమె మాజీ భర్త హెక్మతుల్లా కోర్టును ఆశ్రయించారు.
నజ్దానా ఏడేళ్ల వయసులో ఉండగా పెళ్లి చేసుకుంటానని హెక్మతుల్లా వాగ్దానం చేశారు. నజ్దానా తండ్రి ఈ “బ్యాడ్ మ్యారేజ్”కి అంగీకరించారు. వివాహం ద్వారా ‘శత్రువుల’ను ‘మిత్రులు’గా మార్చి కుటుంబ వివాదాలను పరిష్కరించడమే “బ్యాడ్ మ్యారేజ్” అని అంటుంటారు.
ఎనిమిదేళ్ల తర్వాత అంటే నజ్దానాకు 15 ఏళ్ల వయసు రాగానే ఆమెను తనకు ‘భార్య’గా అప్పగించాలని హెక్మతుల్లా డిమాండ్ చేశారు.
అయితే, హెక్మతుల్లా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అప్పట్లో (2021లో తాలిబాన్ పాలన రాకముందు) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నజ్దానా. హెక్మతుల్లాను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు.
రెండేళ్ల తర్వాత, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నజ్దానా తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.