- ఒకే దశలో పోలింగ్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల
- నవంబర్ 12న పోలింగ్..డిసెంబర్ 8న కౌంటింగ్
న్యూఢల్లీి,అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమా చల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేస్తుందని అంతా భావించారు. అయితే ఈసీ మాత్రం గుజరాత్ షెడ్యూల్ ప్రకటించలేదు. గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనున్నందున ఈ ఏడాది చివరలోనే ఎన్నికలు నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం కేవలం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని మాత్రమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో ఎన్డీఏ బలం 111కు చేరింది. ఇకపోతే హిమాచల్ ఎన్నికల నోటి ఫికేషన్ అక్టోబర్ 17న విడుదల చేస్తారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 25 గాను, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 27న, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 29నగా పేర్కొన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261 ఓటర్లు కాగా ఇందులో పురుషులు 27,80,208, మహిళలు ? 27,27,016, మొదటిసారి ఓటర్లు 1,86,681, 80 ఏళ్లపైబడిన ఓటర్లు 1,22,087 మంది ఉన్నారు.