- అసోం పర్యటనలో గతాన్ని గుర్తు చేస్తున్న అమిత్ షా
- బిజెపి కార్యకర్తల సమావేశంలో మంత్రి వెల్లడి
- మోదీ నేతృత్వంలో శాంతి, అభివృద్ధి బాటలో అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు
- డెబ్భై ఏళ్ళ పాలనలో ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ఏం చేసింది
గౌహతి,అక్టోబర్ 8 (ఆంధ్రపత్రిక): తాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతగా అస్సాంకు గతంలో వచ్చానని, అయితే అప్పటి ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా పరిషత్ విద్యార్థులపై లాఠీలతో దాడిచేయించారని, తమను తీవ్రంగా కొట్టారని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చెప్పారు. తన రాజకీయ జీవితంలో తొలినాళ్ళను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. అమిత్ షా శనివారం గువాహటిలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన కార్యక్రమాలను నిర్వహించినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నేను విద్యార్థి పరిషత్ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని హితేశ్వర్ సైకియా తీవ్రంగా కొట్టారు. అస్సాం కీ గలియాన్ సూనీ హై, ఇందిరా గాంధీ ఖూనీ హై వంటి నినాదాలు చేసేవాళ్ళం. బీజేపీ అస్సాంలో సొంతంగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని అప్పట్లో ఎవరూ ఊహించలేదని అమిత్ షా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు గత ఎనిమిదేళ్ళ నుంచి శాంతి, అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నాయన్నారు. డెబ్భై ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఈ ప్రాంతాన్ని హింస, అరాచకంలోకి నెట్టిందని, మోదీ నాయకత్వం ఈ ప్రాంతానికి శాంతిని తీసుకొచ్చిందని, ఈ ప్రాంతం ప్రధాన జీవన స్రవంతిలో చేరడానికి దోహదపడిరదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాల్లో భారత దేశాన్ని ముక్కలు చేసే పక్రియ జరిగిందని, దానిని కాంగ్రెస్ మౌనంగా చూసిందని చెప్పారు. ’భారత్ జోడో’ను కోరుకునేవారికి ఈశాన్య భారత దేశంలో ఏర్పడిన శాంతి, జరుగుతున్న అభివృద్ధి ఓ ఉదాహరణ అని తెలిపారు. కనీసం ఒక ఉపన్యాసమైనా ఇవ్వకుండా దేశాన్ని ఏ విధంగా సమైక్యంగా ఉంచగలమనేదానికి ఉదాహరణ అని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఆ పార్టీ నూతన ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు భాబేష్ కలిత, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.