- అన్ని పంచాయతీల్లో పీఏసీఎస్‌లు ఏర్పాటు: అమిత్ షా
- పేదరికం నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యంగా పీఏసీఎస్‌లు
- తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అధిక ప్రయోజనం
- సహకార రంగాన్ని పట్టించుకోని గత ప్రభుత్వాలు
- వచ్చే ఐదేళ్లలో పాల ఉత్పత్తిని రెట్టింపు
గ్యాంగ్‌టక్,అక్టోబర్ 7 (ఆంధ్రపత్రిక): దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ(పీఏసీఎస్)లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడిరచారు. వచ్చే ఐదేళ్లలో డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా పలు కార్యకలాపాలను మరింతగా వృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ప్రస్తుతం 65వేల పీఏసీఎస్‌లు క్రియాశీలంగా ఉన్నాయన్న అమిత్ షా.. 2027 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అలాంటి ఒక సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తద్వారా వ్యవసాయ, డెయిరీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో మరింతగా ప్రోత్సహించే వీలు కలుగుతుందని చెప్పారు. సిక్కింలో పర్యటించిన ఆయన గ్యాంగ్‌టక్‌లో తూర్పు, ఈశాన్య జోన్ల డెయిరీ సహకార సదస్సును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.
ఐదేళ్లలో పాల ఉత్పత్తి రెట్టింపే లక్ష్యం..
దేశంలో పేదరికం నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యంగా పీఏసీఎస్‌ల ద్వారా గ్యాస్, పెట్రోల్ విక్రయంతో పాటు డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చన్నారు. వీటి ఏర్పాటుతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలగనుందని చెప్పారు. గత ప్రభుత్వాలు సహకార రంగాన్ని పట్టించుకోలేదని.. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పేదరికం నిర్మూలనలో ఈ రంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం ద్వారా దేశీయ అవసరాలతో పాటు పొరుగుదేశాల మార్కెట్లో డిమాండ్‌ను తీర్చే స్థాయికి ఎదగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆ లక్ష్యం కోసం లబ్ధిదారులంతా శ్రమించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని.. అందులో భాగంగానే వాయు, రైలు మార్గాలతో పాటు రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మోదీ చేస్తోన్న కృషికి సంబంధించిన ఫలితాలు 2034నాటికి అందరికీ కనబడతాయన్నారు