- కర్నాటకలో కొనసాగనున్న రాహుల్ పాదయాత్ర
- భారత్ జోడో పాదయాత్ర భారతదేశ శక్తికి ప్రతీక
- యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు
- 457 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్
- రేపు గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్రకు విరామం
- కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రంలోకి రానున్న రాహుల్ యాత్ర
బెంగళూరు,సెప్టెంబర్30 (ఆంధ్రపత్రిక): కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ దగ్గరున్న ఊటీ`కాలికట్ జంక్షన్ నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ పాదయాత్ర గురువారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ జోడో పాదయాత్ర భారతదేశ శక్తికి ప్రతీక అని అన్నారు. ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగుతుందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. తమిళనాడు, కేరళలో 22 రోజులపాటు సాగిన ఈ యాత్రలో రాహుల్ 457 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
కేరళ నుంచి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర శుక్రవాం నుంచి 19 రోజుల పాటు జరగనుంది. తమ రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీకి గుండ్లపేట్ దగ్గర కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. సిద్ధరామయ్య సహా ఇతర సీనియర్ నేతలు స్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అవ్వనుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సెప్టెంబర్ 10న తమిళనాడు నుంచి కేరళలోకి ప్రవేశించిన యాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ 19 రోజుల వ్యవధిలో 7 జిల్లాల మీదుగా 450 కిలోవిూటర్ల దూరంలో కర్ణాటకలో యాత్ర సాగనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మొత్తం 3,750 కిలోమీటర్ల మేర సాగనుంది.