కట్టుదిట్టంగా ఏర్పాట్లు:- కలెక్టర్ డిల్లీరావు వెల్లడి
విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 30, (ఆంధ్రపత్రిక):- మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తారని, ఆ రోజున లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రెండో తేదీ తెల్లవారుజాము రెండు గంటల నుండి మూడు గంటల మధ్య వీవీఐపీలు, హైకోర్టు న్యాయమూర్తులు దర్శనం కోసం కేటాయించడం జరిగిందన్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుండి భక్తులందరికీ ఉచిత సర్వదర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 3గంటలు అనంతరం వీవీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఆరోజు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. శరన్నవరాత్రులు ప్రారంభం నుండి నేటి వరకు ఎటువంటి ఘటనలు జరగకుండా సజావుగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగడానికి నిరంతరం పనిచేస్తున్న పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.