- గ్రీన్కో ప్రాజెక్టుల ఏర్పాలుకు సహకరించాలి
- రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి జగన్ ప్రారంభోత్సవం
- రూ.2500 కోట్ల పెట్టుబడితో వేయి మందికి ఉపాధి
- పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఉంటుందన్న జగన్
- ప్రభుత్వమే మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుంది
- ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది
- పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంది
- దేశంలోనే 11.43 వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఏపీ
- రాష్ట్రంలో వేగంగా మరో 4 పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులు.
నంద్యాల,సెప్టెంబర్28(ఆంధ్రపత్రిక): రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని సిఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ లీజు అంశాన్ని తీసుకొచ్చారు. ఒక లొకేషన్లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని.. ఈ విషయంలో రైతులను ఒప్పించాలని సీఎం సూచించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించి రైతులు భూములు ఇచ్చేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. గ్రీన్కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని రూ.2,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి పరిశ్రమలో ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాంకో సిమెంట్స్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. రైతులకు ఎకరాకు రూ.30 వేలు లీజు ఇచ్చి సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. వరుసగా 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ నిలిచామన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. దేశంలోనే 11.43 వృద్ధి రేటుతో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మరో 4 పోర్టులు, 3 ఇండస్టియ్రల్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడిరచారు. నంద్యాల జిల్లా ఒకరోజు పర్యటన భాగంగా కొలిమిగుండ్ల మండలం, కల్వటాల గ్రామం సమీపంలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రకి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సామూన్, రామ్ కో సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఆర్ వెంకట్రామ రాజా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, రాష్ట్ర భూగర్భ గనుల, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, బనగానప్లలె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ పి.పి.నాగిరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, రామ్ కో సిమెంట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కె.శోభన్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. కల్వటాల హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభానికి విచ్చేసిన జగన్ మోహన్ రెడ్డి రామ్ కో సిమెంట్ పరిశ్రమలో స్విచ్ ఆన్ చేసి పరిశ్రమను ప్రారంభించారు. అంతకుముందు రామ్ కో సిమెంట్ పరిశ్రమలో ఫోటో గ్యాలరీ, గ్రీన్ రూమ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు.కల్వటాల గ్రామ సవిూపంలో దాదాపు 450 ఎకరాల్లో రూ.1950 కోట్లతో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. సిమెంట్ పరిశ్రమ నుంచి ప్రతి ఏటా 3.50 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జరుగనుంది. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, రామ్ కో వ్యవస్థాపకులు రామ సుబ్రమణ్యస్వామి వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.