- భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
- రేపటి నుంచి ప్రారంభంకానున్న దసరా మహోత్సవాలు
- పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతి
- అంతరాలయ దర్శనం గవర్నర్, ఛీఫ్ జస్టిస్, సీఎం వంటి వీవీఐపీలకే
విజయవాడ,సెప్టెంబర్24(ఆంధ్రపత్రిక): ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. భారీగా ఏర్పాట్లు చేసి భక్తులకుఉ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని ఆలయ కార్య నిర్వహణ అధికారి భ్రమరాంబ తెలిపారు. పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తొలి రోజు అమ్మవారికి స్నపన కార్యక్రమం ఉంటుందని, ఆరోజున ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామన్నారు. అంతరాలయ దర్శనం గవర్నర్, ఛీఫ్ జస్టిస్, సీఎం వంటి వీవీఐపీలకే ఉంటుందని తెలిపారు. కెనాల్రోడ్డు వినాయకుడి గుడి నుంచి క్యూలు ప్రారంభమవుతాయని, రూ.300, రూ.100 టికెట్లతో దర్శనం చేసుకునే వారికి, వీఐపీలకు, ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు ఘాట్రోడ్డులో ఓం టర్నింగ్ నుంచి ఐదు క్యూలు ఉంటాయని పేర్కొన్నారు. మధ్యలో నైవేద్య సమయాల్లో కొంతసేపు, సాయంత్రం మహా నివేదన, మంత్రపుష్పం, పంచహారతుల సమయంలో గంట సేపు దర్శనం నిలిపివేస్తారన్నారు. రూ.300. రూ.100 దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఉంచామని, రూ.500 టికెట్తోనూ దర్శనం ఉంటుందని, వీటిని ఆన్లైన్లో ఉంచలేదని తెలిపారు. భక్తులకు భోజనాలపై నిర్ణయించలేదని, ఇప్పటికైతే లేనట్టేనని తెలిపారు. 21 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. పున్నమి ఘాట్ వద్ద 200, భవానీ ఘాట్ వద్ద 100, సీతమ్మవారి ఘాట్ వద్ద 500 షవర్లను ఏర్పాటు చేశామన్నారు. చివరి మూడు రోజుల్లో భవానీ దీక్షాధారులు వస్తారని, ఇరు ముడి తీయడం, హోమగుండాలు ఇప్పుడు ఉండ వని, భవానీలు వేచి ఉండేందుకు గట్టు వెనుక టీటీడీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వృద్థులు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు ఉంటాయని, 200 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించామని, దేవదాయశాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ నుంచి వివిధ హోదాల్లో ఉన్న 200 మంది సిబ్బంది పర్యవేక్షణకు వస్తున్నారన్నారు. ఉత్సవాల వ్యయం రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. గోశాల పక్కన స్థలంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించను న్నట్లు తెలిపారు. ఉత్సవాలను కట్టుదిట్ట ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా అన్నారు. ఏర్పాట్లను ఆయన, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూల నిర్మాణంలో కొంతలోపం ఉండడాన్ని గమనించి సూచనలు చేశారు. క్యూల ను, స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఆరా తీశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరింత నిఘాను పెంచాలన్నారు.