కలెక్టర్ డిల్లీరావు వెల్లడి
విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 24, (ఆంధ్రపత్రిక): శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. సోమవారం నుండి అక్టోబర్ 5వ తేది వరకు నిర్వహించే దసరా ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఆలయ ఈవో భ్రమరాంబలతో కలిసి కలెక్టర్ డిల్లీరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి 14 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 26వ తేది నుండి 1వ తేది వరకు రోజుకు 60 వేల మంది భక్తులతో 3 లక్షల 50 వేల మంది, అక్టోబర్ 2వ తేది నుండి 5వ తేది వరకు 1లక్ష 50 వేల మంది భక్తులతో 6 లక్షలు, అక్టోబర్ 2వ తేది ఆదివారం మూలనక్షత్రం రోజున 2 లక్షల వరకు, అనంతరం 6, 7 తేదీలలో 2 లక్షల 50 వేల మంది భక్తులు మొత్తంగా 14 లక్షల మంది భక్తులకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అన్నారు. వినాయకుడి గుడి నుండి టోల్ గేటు ద్వారా కొండపైకి ఓం టర్నింగ్ వరకు 3 మార్గాలు, ఓం టర్నింగ్ వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, విఐపిలకు ఒక్కో మార్గం చొప్పున 5 క్యూలైన్లు వాటర్ ప్రూఫ్ షామియానాలతో ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాలకు 20 లక్షల లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచామన్నారు.
కొండదిగువన కనకదుర్గ నగర్ వద్ద 13 ప్రసాదం కౌంటర్లు, కొండపైన ఓం టర్నింగ్, పున్నమిఘాట్, బస్టాండ్, రైల్వేస్టేషన్, స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఒక్కొక్క కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. జల్లు స్నానాల కోసం 800 షవర్లు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో సీతమ్మవారి పాదాల నుండి దోభి ఘాట్ వరకు 500, పున్నమి ఘాట్ వద్ద 200, భవానీ ఘాట్ వద్ద 100 ఉన్నాయన్నారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక షెడ్జ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి షిప్టుకు 200 మంది, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ వద్ద షష్టుకు 50 మంది నాయి బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారన్నారు. కొండపైన, దిగువున, ఘాట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 15 మెడికల్ క్యాంపులు ఏర్పాలు చేసి అత్యవసర మందులను, వియంసి, ఓం టర్నింగ్ వద్ద 6 బెడ్లు ఆసుపత్రులు అందుబాటులో ఉంచామన్నారు. భక్తులకు రూ.300, రూ.100 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విఐపిలకు రూ.500 టిక్కెట్లు అందుబాటులో ఉండేటా రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహాం, కలెక్టరేట్, నగరపాలక సంస్థ, టూరిజం గెస్టహౌస్ ఎదురుగా, టోల్ గేటు, ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేశామన్నారు.
అన్ని ఘాట్ వద్ద స్విమ్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్టులలో 800 మంది అధికారులకు విధులను కేటాయించమన్నారు. సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వృద్ధులు, వికాలంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విఐపి, వివిఐపిలకు వివిధ ప్రాంతాలనుండి 21 వాహనాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నగర పోలీస్ కమీషనర్ కాంతి రానా టాటా మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఐదు వేల మంది వివిధ స్థాయి పోలీస్ అధికారులు విధులను నిర్వర్తిస్తారన్నారు. 12 వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తామని తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు 400 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, మోడల్ గెస్ట్ హౌస్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అన్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.