మొగల్తూరు సెప్టెంబర్ 23 (ఆంధ్ర పత్రిక): రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఉద్దేశంతో మహిళలకు అనేక పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మాత్యులు శ్రీమతి. తానేటి వనిత అన్నారు .శుక్రవారం మొగల్తూరు మండల కేంద్రంలో వైయస్సార్ చేయూత మూడో విడత ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న కోవిడ్ సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. వైయస్సార్ చేయూత ద్వారా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల కాలంలో 75 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీ మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఉద్దేశంతో , బాల కార్మికవ్యవస్థ నిర్మూలించాలని మన పిల్లల బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని అందరూ చదువుకునేటట్లు వారికి ఆర్థిక సహాయం అందించడం , విద్యాదీవెన, వసతిదీవెన , అమ్మవడి వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు . సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆ కలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారు ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ గతంలో ఒక పథకం మంజూరు చేయాలంటే ఆరు నెలల సమయం పట్టేది , ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులందరిని గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం , మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలు మహిళలు అభివృద్ధి చెందడానికి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం శాసనసభ్యులు శ్రీ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయూత కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తద్వారా మహిళలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.
పెద్ద వ్యాపారాలు చేసుకునేందుకు పెద్దపెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వారి ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో కులవృత్తులు చేసుకునేవారు అదే కులవృత్తి చేసుకునే విధంగా వారికి చిన్న చిన్న పనిముట్లు ఇచ్చేవారని , ఈ ప్రభుత్వంలో అందరు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి భావించి పేదరికంలో ఉన్న పిల్లలు అందరూ చదువుకోవాలని అమ్మఒడి ద్వారా 15 వేల రూపాయలు ఇస్తున్నరని, నాడు నేడు కింద అన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్ లు నిర్మించడంతోపాటు ఇప్పటికె ఉన్న పి హెచ్ సి లు , సబ్ సెంటర్లు , సి హెచ్ సి లలో వసతులు మెరుగుపరిచి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో 3వేల రోగాలకు వైద్యం అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతినెల ఒకటో తేదీన ఉదయం ఇంటింటికి పెన్షన్లు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేదవారికి ఇల్లు పట్టాలు, ఇల్లు నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో ఆర్ బి కే లు , సచివాలయాలు నిర్మించి గ్రామస్థాయిలోని అన్ని సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. వైయస్సార్ చేయూత కింద మూడో విడత మొగల్తూరు మండలంలోని 3581 మందికి 6,71,43 750 రూపాయలు ఈరోజు అందించడం జరిగిందని తెలిపారు.జిల్లా పరిషత్ చైర్మన్ కావురు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల పేరునే రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంబీసి చైర్మన్ పెండ్ర వీరన్న, రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్ బర్రె లీల, సబ్ కలెక్టర్ సి విష్ణు చరణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్ ఛైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ,, జడ్పిటిసి లు బొక్క రాధాకృష్ణ, తిరుమాని బాబ్జి, సర్పంచ్ పడవల మేరీ సత్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.