పాదయాత్ర ముగింపు సభలో మండిపడ్డ బండి సంజయ్
హైదరాబాద్,సెప్టెంబర్22(ఆంధ్రపత్రిక): తెలంగానలో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుందని కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి అన్నారు. కెసిఆర్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడం ఖాయమన్నారు.
తెలంగాణలో పరివర్తనం వచ్చిందని కేంద్రమంత్రి అన్నారు. ప్రజలు అవినీతి పాలనతో విసిగారని,భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుందనికేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ అన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి అన్నారు. బండిసంజయ్ నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆమె ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఇకపోతే టీఆర్ఎస్ వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు కాదని, దళిత సిఎంను కుర్చీలో కూర్చోబెట్టి కొత్త సచివాలయ ఘనత చాటాలన్నారు. నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. మునుగోడులో ఓడిపోతారన్న విషయం కేసీఆర్ కు తెలుసని.. అందులో గెలుపు కోసం అమలుకాని హావిూలు ఇచ్చేందుకు సిద్ధమైతుండని విమర్శించారు.
కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడులో బీజేపీనే గెలుపు ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఎస్సీ ఓట్ల కోసమే సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టిండని బండి ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం అంబేద్కర్ జయంతి, వర్థంతి కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హావిూలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. దళితున్ని సీఎం చేస్తా లేకపోతే తల నరుక్కుంటానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కొత్త సెక్రటేరియెట్‌లో దళిత సీఎంను కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన, ఆదివాసీల విషయంలోనూ ముఖ్యమంత్రి మోసపూరితంగా వ్యవహరించారని బండి మండిపడ్డారు. ఎస్టీ అభ్యర్థిని రాష్ట్రపతిగా నిలబెడితే ఓడిరచాలని చూసిండని విమర్శించారు. ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆదివాసీ, గిరిజన మహిళలను జైలులో పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చురకలంటించారు. బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్కు నాల్గో విడత పాదయాత్ర ముగింపు సభ నిదర్శనమని బండి అన్నారు. కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో ఏడాది కష్టపడితే కాషాయ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినం చేసుకుని గల్లీగల్లీలో జాతీయ జెండాలు రెపరెపలాడేలా అన్నారు. పాతబస్తీలో కూడా జాతీయ జెండాలు ఎగురవేసేలా చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందని చెప్పారు.
ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా అని బండి సంజయ్ అన్నారు భారత్`పాక్ క్రికెట్ జరిగే ప్రతిసారి పాతబస్తీలో పాక్ జెండాలు పట్టుకుని తిరిగేవారని, బీజేపీ వచ్చాక జాతీయ జెండాలు పట్టుకు న్నారని తెలిపారు. పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిన పార్టీ బీజేపేనని చెప్పారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన పార్టీ బీజేపేనని బండి సంజయ్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ బహిరంగసభలో ఆరోపించారు. తెరాసలో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అటువంటి ఆయన్ని మనం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అసలు రాంకీ సంస్థ చెత్త నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంకీ సంస్థకు కేసీఆర్ ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి అని గుర్తు చేస్తూ.. జవహర్ నగర్ లో కృత్రిమ డంప్ యార్డును సృష్టించిన చరిత్ర కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హడ్కో నుంచి రూ.60 వేల కోట్ల రుణం తీసుకుందని.. నెలకు రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
వచ్చే 2023 సంవత్సరం జనవరి 1వ తేదీలోగా ప్రభుత్వం లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోతే.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు వచ్చింది.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కు గిరిజన బంధు వచ్చింది.. ఈ బంధులన్నీ కేవలం ఉప ఎన్నికల కోసమే. ఉప ఎన్నిక తర్వాత అన్నీ బంద్ అవుతాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించని కేసీఆర్, ఇశాళ కొత్త సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు అని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పంజాగుట్టలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే అక్కడ పెట్టి.. తప్పు జరిగింది అని లెంపలేసుకుని… అప్పుడు సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే ప్రధానికి మొహం చూపించి, పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని, ప్రధానికి దండం పెట్టి దరఖాస్తు చెయ్ అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ధరణి పేరుతో డబ్బులు దండుకుంటున్నారని.. ఒక్క రంగారెడ్డి జిల్లాలో ధరణి పేరుతో అధికారులు వేల కోట్లు దండుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి జిల్లాలో అధికారులు దండుకున్న డబ్బులన్నీ కక్కిస్తామని ఆయన హెచ్చరించారు.