బిహార్‌లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఈరోజు జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ గెలు పొందారు.అయితే, విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం నీతీశ్ ప్రసంగంపై నిరసన తెలి పిన భాజపా ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఓటింగ్‌లో నీతీశ్‌కు 160 ఓట్లు వచ్చా యి. అసెంబ్లీలో మొత్తంగా 243 స్థానాలు ఉండగా.. నీతీశ్ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వానికి 164మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే.
స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడుంది?
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం నీతీశ్ మాట్లాడుతూ భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా నేతలు కేవలం 2020 ఎన్నికల గురించే మాట్లాడొద్దని.. అంతకముందు జరిగిన ఎన్నికల్లో భాజపా కన్నా జేడీయూ ఎక్కువ సీట్లు గెలుచుకున్న సందర్భాలనూ గుర్తు చేసుకోవాలని సూచిం చారు. పట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండి పడ్డారు. వాజ్‌పేయీ, అడ్వాణీ వంటి నేతలు తననెంతో గౌరవంగా చూసేవారన్నారు. ఈరోజు దిల్లీ బయట జరుగుతున్నదంతా పబ్లిసిటీయేనన్న నీతీశ్.. అసలు భారత స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పత్రికలను కూడా స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విరుచుకుపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించడమే భాజపా పనిగా పెట్టుకొందని విమర్శించారు. మార్పు కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా భాజపా అధి ష్ఠానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జేడీ(యు) అధినేత నీతీశ్ ఈ నెల ఆరంభంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేసి ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ కూటమితో జట్టుకట్టారు. ఆగస్టు 10న ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.