జిల్లాలోని ప్రతీ మండలంలోనూ డ్వాక్రా సంఘాలచే “మహిళా మార్ట్ ” లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. వట్లూరు టి.టి.డి.సి లో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సహకారంతో జిల్లాలో డ్వాక్రా మహిళలు బలమైన ఆర్ధిక శక్తులుగా అభివృద్ధిపధంలో దూసుకువెళుతున్నారని, మహిళల ఆర్ధిక స్వావలంభనకు ఏలూరు జిల్లా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందుకుగాను ప్రతీ మండలంలోనూ మండల సమాఖ్యల ఆధ్వర్యంలో జీవనోపాధి కార్యకలాపాలు మరింత ముమ్మరం కావలసిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా ప్రతీ మండల ప్రధాన కేంద్రంలోనూ “మహిళా మార్ట్ ” ల పేరుతో సూపర్ బజార్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి రుణాలు మంజూరు, సూపర్ బజారులు ఏర్పాటు చేయుటకు అనువైన ప్రదేశాల ఎంపిక, నిర్వహణ, తదితర అంశాలపై మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని, వీటిని నెల రోజులలోగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో 33 వేల 500 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వారికి ఇళ్ల నిర్మాణానికి 35 వేల రూపాయలు చొప్పున 115 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఈ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా లబ్ధిదారులు తమ ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా మరింత అందంగా నిర్మించుకోవాలన్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ద్వారా మహిళలు భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్: గ్రామసీమలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో గ్రామ సమాఖ్యలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పిలుపు నిచ్చారు. మహిళలు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అదే స్పూర్తితో మన ఊరు – మన బాధ్యత భావనతో గ్రామాలన్నీ సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా
తీర్చిదిద్దడంలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి, గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరించాలన్నారు. చెత్త సేకరణ కు గాను ప్రతీ ఇంటి నుండి యూజర్ చార్జీలు, తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగాను, పొడి చెత్తను రీ సైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఆ ఆదాయంతో పారిశుధ్య నిర్వహణకు గ్రామ పంచాయతీలకు అదనపు ఆర్ధిక భారం లేకుండా, గ్రామ సమాఖ్యకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి విజయరాజు, ఏ పి డి అనిత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె. రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.