రూ.14 లక్షల కోట్లు హాంఫట్ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌కు జూన్ నెల ఏ మాత్రం కలిసి రాలేదు. మే నెలతో పోలిస్తే జూన్‌లో సెన్సెక్స్ ఏకంగా 4.5 శాతం (దాదాపు 2,500 పాయింట్లు) నష్టపోయింది. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) రూ.14 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.243.65 లక్షల కోట్లకు చేరింది. అమ్మకాల హోరుతో గత నెల ఒక దశలో సెన్సెక్స్ 50,921.22 పాయింట్లకు చేరి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ 9.5 శాతం నష్టపోయాయి. 2020 మార్చి తర్వాత ఒక త్రైమాసికంలో ప్రధాన సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చూసినా సెన్సెక్స్ 8.96 శాతం, నిఫ్టీ 9.01 శాతం నష్టపోయాయి. ఈ ఏడాది జనవరి 17న నమోదైన ఆల్‌టైమ్ హైతో పోలిస్తే మాత్రం గురువారంతో ముగిసిన జూన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ 13 శాతం నష్టపోయాయి.
ఎందుకంటే: రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అమెరికాతో సహా అన్ని దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు, చమురు సెగ, కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం, కొన్ని కంపెనీల షేర్ల ధర అర్హతకు మించి ఉన్నాయన్న అంచనాలు మదుపరులను భయపెడుతున్నాయి. మరోవైపు ఎఫ్‌పీఐలు గత తొమ్మిది నెలల నుంచి పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితులు కుదుటపడితే తప్ప దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ గాడినపడే అవకాశం లేదని మార్కెట్ వర్గాల అంచనా.
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు: నెలాఖరు రోజైన గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనై చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 8.03 పాయింట్ల నష్టంతో 53,018.94 వద్ద క్లోజవగా నిఫ్టీ 18.85 పాయింట్ల నష్టంతో 15,780.25 వద్ద ముగిసింది. ఆరంభం నుంచి మంచి లాభాలతో ట్రేడైనా.. చివర్లో ఒక్కసారిగా అమ్మకాలు హోరెత్తాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి మార్కెట్‌ను బాగా ప్రభావితం చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.