తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది..
తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది.
నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట.
ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది.
ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు.