Noel Tata తొలి విజయం.. డీమార్ట్ని మింగేశాడు, రతన్ టాటా మరణించిన వారంలోనే..
ANDHRAPATRIKA : – – రతన్ టాటా మరణం తర్వాత ఆయన సోదరుడు నోయెల్ టాటా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన టాటా ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అడుగుపెట్టగానే తొలివిజయాన్ని రుచి చూశారు.
రతన్ టాటా మరణించి వారం కూడా కాక మునుపే నిన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రానున్న కాలంలో టాటా గ్రూప్ 5 లక్షల ఉద్యోగులు కల్పించనున్నట్లు వెల్లడించగా తాజాగా మరో విజయం సొంతమైంది.
సెప్టెంబరు త్రైమాసికంలో డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్కెట్లలో షేర్లు భారీగా క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. నేడు ఇంట్రాడేలో కొంత పుంజుకున్నాయి. తాజాగా రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని డీమార్ట్ కంపెనీని టాటాలకు చెందిన ట్రెంట్ అధిగమించింది. ప్రస్తుతం ట్రెంట్ కంపెనీ మార్కెట్ విలువ రూ.2.93 లక్షల కోట్లుగా ఉండగా.. అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాప్ రూ.2.73 లక్షల కోట్ల వద్దకు దిగజారింది. ప్రస్తుతం ఈ వార్త స్టాక్ మార్కెట్లతో పాటు వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఎందుకంటే బలహీనమైన రెండవ త్రైమాసిక ఫలితాల తర్వాత అనేక బ్రోకరేజీ సంస్థలు అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. అలాగే కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.3,702కి తగ్గించారు. దీంతో కంపెనీ షేర్లు 9 శాతం మేర ఒక్క రోజులో పతనమైన సంగతి తెలిసిందే. డీమార్ట్ తాజా క్యూ2 ఫలితాలను గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే లాభం కేవలం 8 శాతం మాత్రమే పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో మెుదటి త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే లాభాలు 12 శాతం తగ్గుదలను చూశాయి. వాస్తవానికి దేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా పుంజుకోవటంతో కిరాణా సరకుల వ్యాపారంలో డీమార్ట్ గట్టి పోటీని అందుకుంటూ వ్యాపారాన్ని కోల్పోతోంది.
మరోవైపు రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఈ ట్రెండ్‌లో ముందున్నారు. టాటా ట్రస్ట్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణంతో ఆయన టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దీని తర్వాత ట్రెంట్ స్టాక్స్ పెరగటంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా పెరిగింది. గతవారం ట్రెంట్ ల్యాబ్‌లో పెరిగిన వజ్రాలను విక్రయించడానికి ‘BOM’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది వెస్ట్‌సైడ్ స్టోర్లలో విక్రయించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా 2 రోజుల్లో షేరు ధర 2% పెరుగుదలను చూసింది. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో రెండు కంపెనీల షేర్ల ధరలను పరిశీలిస్తే.. డీమార్ట్ స్టాక్ ధర 1 శాతానికి పైగా పతనంతో రూ.4150 వద్ద ఒక్కో షేర్ ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ముగించింది. అలాగే ట్రెంట్ స్టాక్ ధర 3.92 శాతం పతనం తర్వాత చివరికి ఎన్ఎస్ఈలో రూ.7805.80 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది.