Email Scam: ఫేక్ మెయిల్స్‌తో జాగ్రత్త.. నమ్మారో బకరా అయిపోతారు..
ANDHRAPATRIKA : – – దేశంలో ఆన్ లైన్ మోసాలు రోజుకో రూపం మార్చుకుంటూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వాటి బారిన పడి ప్రజలు కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు.
ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మోసగాళ్లు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు. గతంలో బ్యాంకు అధికారులంటూ ఫోన్లు చేసేవారు. బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీలను అడిగి మోసాలకు పాల్పడేవారు. ఆ సమయంలో చదువుకోనివారు, ఆన్ లైన్ విధానంపై అవగాహన లేనివారు మాత్రమే మోసపోయేవారు. కానీ ఇప్పుడు విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఆన్ లైన్ స్కాములలో చిక్కుకుని భారీగా నష్టపోతున్నారు. ఇటీవల చెన్నైకి చెందిన వ్యాపారవేత్త స్పూఫింగ్ స్కాములో చిక్కుకుని రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో అధికారులు ఆ సొమ్మును రికవరీ చేయగలిగారు.
రూ.2 కోట్ల మోసం
చెన్నై కేంద్రంగా అగ్రిగో ట్రేడింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ కంపెనీ జనరల్ మేనేజర్ కు సెప్టెంబర్ 26న ఒక ఇ-మెయిల్ వచ్చింది. వ్యాపారానికి సంబంధించి చట్టపరమైన సరఫరాదారు నుంచి వచ్చిన మెయిల్ అది. అమెరికాలోని రీజియన్స్ బ్యాంకు ఖాతాకు 238.500 డాలర్లు (రూ.2 కోట్లు) చెల్లింపు కోసం ప్రొఫార్మా ఇన్ వాయిస్, బ్యాంక్ వివరాలను కూడా దానిలో పొందుపరిచారు. కంపెనీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇది ఎప్పుడూ జరిగే పరిణామమే కావడంతో జనరల్ మేనేజర్ ఆ ఇ-మెయిల్ నిజమని నమ్మారు. వెంటనే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎన్ఈఎఫ్ టీ ద్వారా చెల్లింపులను ప్రాసెస్ చేశారు. తర్వాత రోజు అసలు సరఫరాదారుడితో మాట్లాడినప్పుడు ఇ-మెయిల్ మోసపూరితమైనదని తెలిసింది.
డబ్బుల రికవరీ..
కంపెనీ ప్రతినిధులు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్టేట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ కేసు నమోదు చేసి, వెంటనే చర్యలు చేపట్టింది. యూఎస్ ఏలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రిజియన్స్ బ్యాంకు సహాయంతో ఆ డబ్బులను గుర్తించింది. మొత్తం సొమ్మును రికవరీ చేసి కంపెనీకి నష్టం కలగకుండా చూసింది. సైబర్ నేరగాళ్ల ఎంత తెలివిగా మోసాలు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ.
స్పూఫ్ ఇ-మెయిల్ అంటే..
స్పూఫ్ ఇ-మెయిల్ అంటే ఒకరకమైన మోసపూరిత ఇ-మెయిల్. దీన్ని పంపిన వారి చిరునామా, ఇతర వివరాలు అనుమానించేవిగా ఉండవు. మనం లావాదేవీలు జరిగే సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చినట్టే ఉంటాయి. వీటిని నమ్మి లింక్ లను క్లిక్ చేయడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
-
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
-
మనకు వచ్చిన ఇ-మెయిల్ కు బదులు ఇచ్చే ముందు దాన్ని పంపిన వారి చిరునామాను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి.
-
కంటెంట్ లో ఏమాత్రం గందరగోళం ఉన్నా అప్రమత్తంగా కావాలి. వ్యాకరణ లోపాలు, భాషలో తప్పులు ఉంటే పరిశీలించాలి.
-
సాధారణంగా మోసగాళ్లు డబ్బుల కోసం తొందరపడతారు. లావాదేవీ త్వరగా చేయాలని కోరతారు.
-
ఇలాంటి ఇ-మెయిల్ వస్తే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930ను సంప్రదించాలి. లేదా సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్ లో ఫిర్యాదు చేయాలి.