తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమలలో శ్రీవారి మెట్ల దగ్గర చిరుత కనిపించడంతో యాత్రికులు, భక్తులు భయాందోళనకు గురుయ్యారు. దీంతో సెక్యూరిటీ గార్డులు విజిలెన్స్ సిబ్బందికి, టీటీడీ అటవీ అధికారులు సమాచారం అందించారు.
తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని సమాచారం. సెక్యూరిటీ గార్డు సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు చిరుత సమచారంపై సమాచారం ఇచ్చారు. వన్య మృగాల కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి టీటీడీ అటవీ శాఖ చర్యలు చేపట్టింది.
గతంలోనూ…
గతంలో అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో కొన్ని చిరుతపులను అటవీశాఖ అధికారులు బంధించారు. తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్తున్న ఓ బాలుడిపై దాడి చేశాయి. ఓ సందర్భంలో అయితే చిన్నారిని లాక్కెళ్లి దాడిచేయగా చనిపోవడం భక్తులకు ఆందోళనకు గురిచేసింది. దాంతో తిరుమలలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. భక్తులకు మనోధైర్యం కోసం కర్రలను సైతం టీటీడీ ఇచ్చింది. కొన్ని వేళల్లో తిరుమలలో చిన్నారుల ప్రవేశంపై సైతం కొత్త రూల్స్ తీసుకొచ్చారు. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి కాలిబాట, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం భక్తులతో పాటు టీటీడీని కలవర పెడుతోంది. ముఖ్యంగా కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుతల సంచారం ఎక్కువగా గుర్తించారు. కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడి పోయారు. గతంలో చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లలను నడక మార్గంలో అనుమతించేలా చర్యలు చేపట్టారు. ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించి భక్తులకు జాగ్రత్తలు చెప్పారు.