Devara Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన “దేవర” మొదటి భాగం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
జూనియర్ ఎన్టీఆర్ సొలో హీరోగా నటించిన సినిమా విడుదల కావడం ఆరు సంవత్సరాల తర్వాత కావడంతో పాటు, “ఆర్ ఆర్ ఆర్” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోవు చిత్రం కావడంతో, ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాల మధ్య, “దేవర” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అభిమానుల ఉత్సాహం కూడా అదే స్థాయిలో ఉండటంతో, కొన్నిచోట్ల ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా, కడపలోని రాజా థియేటర్ దగ్గర ఆసక్తికర సంఘటన జరిగింది. విషయం ఏమిటంటే, “దేవర” విడుదల సందర్భంగా థియేటర్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. కొంతమంది టికెట్ లేకుండానే థియేటర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో అభిమానులు, థియేటర్ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ వాగ్వాదం కాస్త ఉధృత స్థాయికి చేరుకోవడంతో, కొంతమంది అభిమానులు సిబ్బందిపై దాడి చేశారు. ఈ పరిస్థితి కారణంగా థియేటర్ నిర్వాహకులు షోను తాత్కాలికంగా నిలిపివేశారు. కడపలోని రాజా థియేటర్ వద్ద ఈ చిన్న ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ, సినిమా విడుదల విజయవంతంగా జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రం నేడు థియేటర్స్‌లోకి వచ్చింది.