ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్నముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటివరకూ జెత్వానీపై వేధింపులకు బాధ్యులుగా భావిస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక అరెస్టులకు దిగింది.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్ లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. స్థానిక కోర్టులో హాజరుపర్చడంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
కాదంబరీ జెత్వానీ ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా జరిగిన వేధింపుల్లో భాగంగా కుక్కల విద్యాసాగర్ ను అప్పటి వైసీపీ ప్రభుత్వం పావుగా వాడుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. కుక్కల విద్యాసాగర్ తో ఇబ్రహీంపట్నం పీఎస్ లో కాదంబరిపై తప్పుడు కేసు పెట్టించి అప్పటికప్పుడు ఆమెను కుటుంబ సభ్యులతో పాటు అరెస్టు చేసి విజయవాడ జైలుకు పంపడం, ఆ తర్వాత ఆమె సదరు పారిశ్రామికవేత్తపై కేసు వెనక్కి తీసుకుని ముంబైకి వెళ్లేలా చేయడంతో ఈ వ్యవహారం ముగిసింది.
ఇందులో కుక్కల విద్యాసాగర్ జెత్వానీపై పెట్టిన తప్పుడు కేసు కీలకంగా మారడంతో ఆయన్ను ఏ1గా చేర్చారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసారు. ఇదే వ్యవహారంలో ఐపీఎస్ ల పాత్ర కూడా నిర్ధారణ కావడంతో వారిని కూడా కలిపి కేసు ఛార్జిషీట్ తయారు చేయనున్నారు. దీంతో త్వరలో సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ లను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిల భారత సర్వీసు అధికారులైన వీళ్లను అరెస్టు చేయాలంటే కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాలశాఖ అనుమతి అవసరమని తెలుస్తోంది. దీనిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.