న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వబోయే తీర్పుపై ఆసక్తి నెలకొంది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపిన సీజేఐ ధర్మాసనం..
కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది.
జనవరి 11న, 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో.. యువతను శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇంతకుముందు విచారణ సందర్భంగా.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.
జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!!