పట్నా: బిహార్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని (AP student) ఆత్మహత్యకు పాల్పడింది. పట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Patna)లో చదువుతున్న ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరికి వేలాడుతూ కన్పించింది.
ఈ మేరకు పోలీసులు శనివారం వివరాలు వెల్లడించారు.
నిన్న రాత్రి 10.35 గంటల ప్రాంతంలో విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే యాజమాన్యానికి విషయం చెప్పారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలంలో సూసైడ్ (Suicide) నోట్ లభించినట్లు తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యార్థిని మరణం గురించి తెలియగానే తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.