వచ్చే నెలలో పుణె, విశాఖకు కొత్త సర్వీసులుఅన్ని నగరాలకూ నడపాలనే లక్ష్యంతో చర్యలు
ఈనాడు, అమరావతి: విజయవాడ విమానాశ్రయానికి మళ్లీ పాత రోజులొచ్చాయి.
2019కి ముందు ఎంత కళకళలాడేదో.. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. దేశంలోని అన్ని నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా కొత్త సర్వీసులు ఆరంభిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొలువుదీరిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పునర్వైభవం రావడంతో విజయవాడ విమానాశ్రయం కీలకంగా మారింది. గత మూడు నెలల్లోనే ముంబయి, దిల్లీ, బెంగళూరుకు నాలుగు సర్వీసులు కొత్తగా ఆరంభమయ్యాయి. వచ్చే నెలలో పుణెకు ప్రారంభం కానుంది. విశాఖకు కూడా నిత్యం సర్వీసులు నడపబోతున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చే సర్వీసే ఉదయం, రాత్రి విజయవాడ మీదుగా విశాఖకు వెళుతోంది.
రికార్డు స్థాయికి ఎదిగి..
విజయవాడ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఏ ప్రాంతానికి ప్రారంభించినా ఆక్యుపెన్సీకి లోటు ఉండదని ఇప్పటికే అనేకసార్లు స్పష్టమైంది. షిర్డీ, వారణాశి, ముంబయి, దిల్లీ ఇలా ఏ నగరానికి కొత్తగా ఆరంభించినా ఆక్యుపెన్సీ 80 శాతానికి పైగానే ఉండేది. 2014 వరకూ ఏడాదికి కనీసం రెండు లక్షలు కూడా లేని ప్రయాణికుల రద్దీ 2018కి వచ్చేసరికి అమాంతం పెరిగి ఏటా 12లక్షలు రాకపోకలు సాగించే స్థాయికి ఎదిగింది. దేశంలోని ఒక్కో నగరానికి సర్వీసులను ఏర్పాటు చేసుకుంటూ రావడంతో ఆ నాలుగేళ్లలో దేశంలోనే అత్యధిక ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయంగా విజయవాడ రికార్డు నెలకొల్పింది.
వైకాపా హయాంలో దయనీయం..
వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో గన్నవరం పరిస్థితిని అత్యంత దయనీయంగా మార్చేశారు. 2019 వరకూ ఇక్కడి నుంచి నిత్యం 60కు పైగా సర్వీసులు.. నెలకు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. దేశంలోని హైదరాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కొచ్చి, వారణాశి, షిర్డీతో పాటు రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, కడప సహా 11 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడిచేవి. ఉదయం 7.45 నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఒక దేశీయ సర్వీసు ఇక్కడి నుంచి ఉండేది. అలాంటిది 2023కు వచ్చేసరికి ఒక్కో నగరానికి ఆపేస్తూ కేవలం 34 సర్వీసులకు తగ్గించేశారు.
నాలుగు ఉమ్మడి జిల్లాలకు కీలకం..
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు విజయవాడే కీలకం. గత ఐదేళ్లలో ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయి.. నెలకు 80 వేలు కూడా ఉండేవారు కాదు. తాజాగా మళ్లీ కొత్త సర్వీసుల రాకతో ప్రయాణికులు నెలకు లక్షకు పైగా పెరిగారు. దేశంలోని అన్ని నగరాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు నడిపినా ఆక్యుపెన్సీకి కొదవ లేదంటూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
దుబాయ్, సింగపూర్‌కు
ప్రస్తుతం షార్జాకు మాత్రమే వారానికి రెండు రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులను ఆరంభించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ఈ రెండు దేశాలకు సర్వీసులు ఆరంభమైతే.. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా అక్కడి నుంచి తేలికగా చేరుకునేందుకు వీలుంటుంది.
ఆ రెండు దేశాలకు సర్వీసులొస్తే ..
విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్ దేశాలకు రోజువారీ అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే చాలని.. ఏళ్ల తరబడి వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. 2018లో అప్పటి చంద్రబాబు సర్కారు వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఏ) విధానంలో సింగపూర్‌కు సర్వీసులను నడిపింది. ఆరంభం దగ్గర నుంచి సింగపూర్ సర్వీసులు 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడిచాయి. ఆరు నెలలు నడిపాక జగన్ సర్కారు 2019లో వచ్చిన వెంటనే ఆపేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ సర్వీసుల ఊసే లేదు.
ఒక్కో నగరానికి పునరుద్ధరిస్తూ..
మళ్లీ ఒక్కొక్క నగరానికి సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ముంబయికి ప్రారంభించారు. దిల్లీ, బెంగళూరు సహా అన్ని నగరాలకు సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. 2019కి ముందు దిల్లీకి 4సర్వీసులు ఉండగా వాటిని తర్వాత రెండుకు తగ్గించేశారు. ప్రస్తుతం దిల్లీకి కొత్త సర్వీసులు ఆరంభిస్తున్నారు. వారం కిందట దిల్లీకి మరో కొత్త సర్వీసు ఆరంభించారు. పుణేకు వచ్చేనెల విమానం ఎగరనుంది.