దేవాలయాలన్నీ ‘నందిని’ నెయ్యి వాడాల్సిందే’తిరుమల’ వివాదంతో నిద్రలేచిన సర్కారు
బెంగళూరు : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ట్రేడ్మార్క్ లడ్డూ నాణ్యతపై వినిపిస్తున్న వివాదాలు కర్ణాటక సర్కారును నిద్రలేపాయి.
నాణ్యమైన లడ్డూల తయారీ కోసం తితిదేకి నందిని నెయ్యిని పంపుతున్న సర్కారు.. సొంతింటిలోనూ ఆ నాణ్యతను కాపాడుకునే ప్రయత్నానికి ఉపక్రమించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం వెల్లడించిన ఆదేశాల ప్రకారం.. ఇకపై ఈ శాఖ పరిధిలోని ప్రతి దేవాలయంలో పంపిణీ చేసే ప్రసాదం, వెలిగించే దీపాలు, ఈ దేవాలయాలకు అనుబంధంగా నిర్వహించే సత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ విధిగా నందిని ఉత్పత్తులను వాడాలి. ఈ ఆదేశం నందిని పాల ఉత్పత్తిదారులు, వ్యాపారులకు వరంగా మారింది.
ః రాష్ట్రంలో గ్రేడుల వారీగా 1.80 లక్షల దేవాలయాలున్నాయి. ఇందులో 35,500 దేవాదాయశాఖ పరిధిలోనికి వస్తాయి. ఇకపై వీటిలో పంపిణీ చేసే ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యత పరీక్షలు తప్పినిసరి కానున్నాయి. ఇందు కోసం మైసూరులోని కేంద్ర ఆహార, సాంకేతిక పరిశోధన సంస్థ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- సీఎఫ్టీఆర్ఐ) ప్రయోగశాలల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ భారతీయ ఆహార భద్రత విలువ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రమాణాల ఆధారంగానే ఈ ప్రసాదాలకు ధ్రువీకరణ చేయాలి. లడ్డు, కేసరిబాత్, హల్వా, చక్కెర పొంగలి, పంచామృతాల్లో వాడే పాలు, పెరుగు, నెయ్యి నందిని సంస్థ నుంచే కొనుగోలు చేయాలి. ఇందుకు కర్ణాటక పాల మండలి (కేఎంఎఫ్)కి ప్రత్యేక ధరల పట్టీని సర్కారు త్వరలో అందించనుంది. సాధారణ వినియోగదారులకు, దేవాలయాలకు ప్రత్యేక ధరలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం కేఎంఎఫ్ తితిదేకి ఏటా 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని అందిస్తున్నట్లు ఈ సమాఖ్య ఎండీ జగదీశ్ తెలిపారు.