Odia Singer Ruksana Bano Dead at 27: 27 ఏళ్లకే ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
రుక్సానా మరణానికి ఖచ్చితమైన కారణాన్ని డాక్టర్లు వెల్లడించలేదు. అయితే ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి కారణంగానే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఏదైనా క్రిమి లేదా విషపురుగు కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటివి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు.
ఒడిశాలోని సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ రుక్సానా బానో బాగానే గుర్తింపు తెచ్చకున్నారు. ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన ఆమెకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. 15 రోజుల క్రితం ఓ సాంగ్ షూటింగ్ కోసం బోలంగిర్ ఊరు వెళ్లారు. ఆగస్టు 27న జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స తర్వాత బోలంగిర్‌లోని భీమా భోయ్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. రుక్సానా పరిస్థితి క్షీణించడంతో బర్గర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటి నుంచి ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.