లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను గురువారం గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున జానీ మాస్టర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
దీంతో ఆయనను నార్సింగి డీసీపీ ఆఫీసులో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇవాళ విచారణ అనంతరం ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. నిన్న జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలతను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారమే.. జానీ మాస్టర్‌ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 కింద రేప్ కేసు , (506 సెక్షన్ కింద), క్రిమినల్ బెదిరింపు కేసు, (323)లోని క్లాజ్ (2) (ఎన్) కింద స్వచ్ఛందంగా గాయపరచడంవంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు పోక్సో కేసు నమోదు అయ్యింది. జానీ కేసు ఇండస్ట్రీలో పలు కీలక మలుపులు తిరుగుతుంది.
జానీ మాస్టర్ కేసుపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తుందని ఆయన ఆరోపించారు. బాధితురాలిపై మూడు రాష్ట్రాల్లో లైంగికంగా దాడి జరిగినప్పుడు.. మూడు రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీకి ఫిర్యాదు చేయాలన్నా. ముందుగా ఇండస్ట్రీలో కంప్లైట్ చేయకుండా డైరెక్ట్ గా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక అనేక అనుమానాలున్నాయన్నారు.
జాని మాస్టర్ గతంలో కూడా కోర్టులు, పోలీసులు చుట్టు తిరిగారు. ఈయనపై గతంలో కూడా పోలీస్ కేసులు ఫైల్ అయ్యాయి. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జాని మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే అత్యాచారం ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయ్యింది. ఆయన పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ కూడా రిలీజ్ చేసింది.
మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టార్ పై చర్యలకు దిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో ఏర్పాటైన పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ను కలిగి ఉంది. ప్యానెల్ వారు మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది.