ఇంటర్నెట్ డెస్క్: కష్టాల్లో పడిన జట్టును కీలక ఇన్నింగ్స్‌లతో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు ఆదుకొన్నారు. ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించారు. అందులో ఒకరు సెంచరీ కొట్టారు.
భారత్‌ను 144/6 స్కోరు నుంచి 340+ స్కోరుకు తీసుకెళ్లడంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో భారత స్పిన్ ద్వయంపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ప్రశంసల వర్షం కురిపించాడు. మరోసారి తమ విలువేంటో ప్రపంచానికి చాటి చెప్పారంటూ కొనియాడాడు.
”వారిద్దరూ ఆడిన విధానం అద్భుతం. అశ్విన్, జడ్డూ అనుభవమే దీనికి కారణం. ఇలాంటి షాట్లను అశ్విన్ గతంలోనూ ఆడాడు. బ్యాక్‌ఫుట్ మీద పంచ్‌లు ఇవ్వడం భలేగుంది. జడేజా కూడా ఓవర్ మిడాన్ మీదుగా బౌండరీలు రాబట్టాడు. ఇవన్నీవారికి చాలా చిన్న విషయాలే. కానీ, టెస్టు క్రికెట్‌ను అర్థం చేసుకొన్న తీరు బాగుంది. ప్రత్యర్థి బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేశారు. అలాంటప్పుడు మన బ్యాటర్లు సంయమనం పాటించారు. ఒక్కసారి కుదురుకున్నాక దూకుడు ప్రదర్శించారు. ఎన్నో మైలురాళ్లను అధిగమించారు.
మనకు చాలా మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అశ్విన్-జడ్డూతోపాటు అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కానీ, సీనియర్లు మాత్రం మరోసారి తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. రిటైర్మెంట్కు దగ్గరవుతున్నా.. తమ విలువ ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పారు. భారత్‌లో ఎప్పుడు ఆల్‌రౌండర్ల గురించి మాట్లాడుకున్నా వీరి ప్రస్తావన లేకుండా ఉండదు” అని డీకే వెల్లడించాడు. ప్రస్తుతం భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది.
సిసలైన ఆల్‌రౌండర్: తమీమ్ ఇక్బాల్
అశ్విన్‌పై బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిసలైన ఆల్‌రౌండర్‌గా అభివర్ణించాడు. ”మనం ఎక్కువగా అశ్విన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అతడి రికార్డులను చూస్తుంటాం. బంతితో అద్భుతాలు సృష్టిస్తాడని తెలుసు. బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. అశ్విన్ అన్‌రేటెడ్ బ్యాటర్. అతడిలో ఇలాంటి ఆటగాడు ఉన్నాడని అనుకోలేదు. బ్యాటింగ్‌కు దిగినప్పుడు అసలు టెయిలెండర్ లేదా బౌలర్‌గా అనిపించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్ మాదిరిగా పరుగులు రాబట్టాడు. బ్యాట్‌ను మెలికలు తిప్పేశాడు. అందుకే, భారత జట్టు క్రైసిస్ మ్యాన్‌గా పేరొందాడు” అని తమీమ్ వ్యాఖ్యానించాడు.