మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో 23వ తేదీవరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అనకాపల్లి, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
24 వరకు భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అంతేకాకుండా ఏపీలో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయి. ఈరోజు అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు వానలు పడతాయి. గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఈరోజు మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఎక్కువ ఉష్ణోగ్రతలు
ఈ రోజు వాతావరణాన్ని పరిశీలిస్తే రాయలసీమలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే సహాయక చర్యలను వెంటనే చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. వర్షాలనుబట్టి లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.