హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష నేతలు చెబుతూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే రుణమాఫీ అమలుకాని రైతులు సర్కార్‌పై పోరుకు సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు.
పలు జిల్లాల నుంచి ప్రజాభవన్‌కు బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసు తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ.. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని ప్రజాభవన్‌కు బయలుదేరాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. మేము ఏమైనా దొంగలమా లేక టెర్రరిస్టులమా?. ఎలాగైనా మేము ప్రభా భవన్ వద్దకు వెళ్తాము’ అని చెప్పుకొచ్చారు.
ఇక, ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దీంతో, రుణమాఫీ కానీ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.