ఈ వ్యవహారంలో నవీన్‌రావు పాత్రపై ఆధారాలు
కొన్ని రోజుల క్రితం నోటీసుల జారీకి యత్నం
ఆయన దుబాయ్ వెళ్లిపోవడంతో కుదరని వైనం
దీంతో ఎల్ఓసీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న నవీన్‌రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.
అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్‌రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుతో కూడా కలసి నవీన్‌రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు.
హార్డ్ డిస్‌్కల ధ్వంసంలోనూ పాత్ర
గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్‌్కలను డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్‌రావుతో పాటు నవీన్‌రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్‌రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్‌రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్‌రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.
వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్‌రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్‌రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్‌రావు పాస్‌పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం.