Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ మహాగణపతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. 9 రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య..
ఇక గంగమ్మ చెంతకు చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటుగా ట్విన్ సిటీస్‌లో నేడు భారీగా గణపతి విగ్రహాలు నిమజ్జనాలు జరగనున్నాయి. దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సోమవరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతి చివరి పూజలు చేశారు. ప్రస్తుతం భారీ క్రేను సాయంతో మహాగణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరవ్యాప్తంగా వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టే 3వేల మంది పోలీసులు గస్తీ కాయనున్నట్లు తెలిపారు. ఇక మంగళవారం నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం 700 మంది పోలీసులను కేటాయించారు. ఈ మార్గంలో మొత్తం 56 సీసీటీవీ కెమెరాలతోటు.. ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 4 గంటలకు బాలాపుర్ గణేషుడు.. హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేటి ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను హైదరాబాద్ నగరంలోకి అనుమతించేది లేదని అధికారులు వెల్లడించారు. నగరంలో మొత్తం 67 డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా.. విగ్రహాల శోభాయాత్రలో కలర్ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై కలర్ పేపర్లు, చెత్త వేయడం వల్ల జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.
శోభయాత్ర రూట్ మ్యాప్..
బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, నాగుల చింత, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజేమార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహాం, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగిన తరువాత ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు రెండురోజుల క్రితమే తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సికింద్రాబాద్ వైపు వచ్చే యాత్ర ఆర్పీరోడ్డు, ఎంజేరోడ్డు, కర్బాలమైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి ప్రధాన యాత్రలో కలవనున్నాయి. చిలకలగూడ వైపు నుంచి వచ్చే యాత్ర గాంధీ ఆసుపత్రి వద్ద నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవర్, నారాయణగూడ వై జంక్షన్, హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీలో కలవాలి.
ఉప్పల్ వైపు నుంచి వచ్చే గణపయ్యలను శ్రీరమణ జంక్షన్, 6 నెం. జంక్షన్, తిలక్‌నగర్, శివమ్ రోడ్డు, ఎన్సీసీ, విద్యానగర్ టీ జంక్షన్, హిందీ మహావిద్యాలయ, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్‌పురా, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వద్ద.. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు నుంచి వచ్చే ర్యాలీతో పాటు కలవాలి. అలాగే దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్ వైపు నుంచి నల్గొండ క్రాస్‌రోడు వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలు.. మూసారాంబాగ్, అంబర్పేట్ మీదుగా హిమాయత్‌నగర్ వైపునకు వెళ్లి ప్రధాన ర్యాలీలో కలవాలి. అలాగే తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఫీవర్ ఆసుపత్రి వద్ద నుంచి ప్రధాన ర్యాలీతో పాటు కలవాలి. టోలిచౌకీ, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్, నిరాంకారీ, ఓల్డ్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీర్ మార్గ్‌కు చేరుకోవాలి. ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, ఖైరాతాబాద్ వైపు నుంచి నిరాంకారి వద్ద గణేషుని యాత్రలో కలవాలి. ఆసీఫ్‌నగర్ సీతారాంబాగ్, అఘాపురా, గోషమహాల్, అలాస్క, మాలకుంట జంక్షన్ నుంచి వచ్చే యాత్ర ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన యాత్రలో కలవాలి.