కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడువిశాఖ – రాయపూర్ (దుర్గ్) వందేభారత్ రైలు ప్రారంభం
వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న రామ్మోహన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, శ్రీ భరత్, డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించిన కార్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన జరగనుందని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం విశాఖ-రాయపూర్ (దుర్గ్) మధ్య నడిచే కొత్త వందేభారత్ రైలును విశాఖలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘జోన్‌కు సంబంధించి గతంలో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారమవడంతో రైల్వేకు ఆ స్థలం అప్పగించేశాం. త్వరలోనే జోన్ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశాం. దసరా, దీపావళి మధ్య మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు’ అని వెల్లడించారు. ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపేలా వందేభారత్‌ను నడపడం ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా ఉపయోగకరమని కేంద్రమంత్రి తెలిపారు. అనంతరం రైలులో రామ్మోహన్నాయుడు కొంతదూరం ప్రయాణించారు. ఎంపీలు శ్రీభరత్, బాబూరావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, గణబాబు, డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.