ఇంటర్నెట్ డెస్క్ : వందే మెట్రో సర్వీస్ పేరును “నమో భారత్ ర్యాపిడ్ రైల్”గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఇవాళ సాయంత్రం 4:15 గంటలకు భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ మెట్రో సేవలను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని, సంప్రదాయ రైళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, దీని అందుబాటులోకి తెచ్చి రద్దీగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) కింద అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని విస్తృతంగా అమలు చేయడంతోపాటు, పట్టణ కేంద్రాల మధ్య హై-స్పీడ్ కారిడార్లను రూపొందించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి.
నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రత్యేకతలివే..
నమో భారత్ ర్యాపిడ్ రైల్లో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి.
ఇది భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు 359 కి.మీ దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది.
ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది.
అహ్మదాబాద్ నుంచి సెప్టెంబర్ 17 న రెగ్యులర్ సర్వీస్ ప్రారంభమవుతుంది
మొత్తం ప్రయాణానికి రూ.455 ఖర్చు అవుతుంది.
ఇందులో ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లు, మాడ్యులర్ ఇంటీరియర్స్ ఉంటాయి.
నమో భారత్ రైళ్లు అహ్మదాబాద్‌తోపాటు పలు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచుతాయి.
ఇంటర్సిటీ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా నమో భారత్ ర్యాపిడ్ రైల్ పని చేస్తుంది.