హైదరాబాద్: లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొంది.
రాత్రి 8.30గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరే రైలు అర్ధరాత్రి 12.30గంటలకు ప్రారంభమై 1.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తు సమాచారం చూసుకోకుండా స్టేషన్లో పడిగాపులు కాశామని కొందరు, సందేశం చూసి మార్గమధ్యంలోనే తిరుగుముఖం పట్టామంటూ మరికొందరు వాపోయారు. సికింద్రాబాద్ స్టేషన్ అధికారులను అడిగితే రాత్రి 1.15గంటలకు రైలు రీషెడ్యూల్ అయ్యిందని చెప్పడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే జంక్షన్ల వద్ద గంటల తరబడి గౌతమి ఎక్స్ప్రెస్ రైలు ఆపేస్తున్నారని, దీంతో 12గంటల ప్రయాణం మరింతగా పెరిగి నరకం కనిపిస్తోందంటూ కొందరు ప్రయాణికులు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.