Germany ఇంటర్నెట్డెస్క్: భారత్ వినియోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ వ్యవస్థను జర్మనీ (germany) విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్బాక్ పొగడ్తలతో ముంచెత్తారు.
బెర్లిన్లో జరిగిన వార్షిక దౌత్యవేత్తల సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను భారత్లో పనిచేసిన నాటి అనుభవాలను గుర్తు చేసుకొన్నారు. ఆమె జైశంకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ”మనం రెండేళ్ల క్రితం తొలిసారి దిల్లీలో భేటీ అయ్యాం. అప్పట్లో నేను అక్కడే ఉన్నాను. మీ దేశంలో మెట్రోలో ప్రయాణించాను. ఒక్కో కిలోమీటర్ను ఆధునికీకరించే మీ వ్యూహాన్ని గమనించాను. అంతేకాదు.. అక్కడ ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు యూపీఐను వినియోగించడం నన్ను ఆకర్షించింది. అలా చేయడం జర్మనీలో అసంభవమని భావించాను. దీనిని జాగ్రత్తగా గమనించి.. మా దేశంలోని ఇతర విభాగాలతో పోలిస్తే విదేశాంగ శాఖలో డిజిటలైజేషన్ దిశగా కీలక మార్పులు తీసుకొచ్చాం. వీధి వ్యాపారులకు చెల్లింపుల్లోనే డిజిటలైజేషన్ సాధ్యమైనప్పుడు కూడా మా దౌత్య కార్యాలయాల్లో వీసా దరఖాస్తులను ఇంకా బాక్సుల్లో తీసుకెళ్లడం దురదృష్టకరమని భావించాను. సరే.. వీధుల్లో చెల్లింపులను నేను మార్చలేను.. కనీసం మా విదేశాంగ శాఖలోనైనా డిజిటలైజేషన్ చేయాలనుకొన్నాను” అని తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నాలీనాతో చర్చించారు. ప్రస్తుత యుద్ధానికి కేవలం దౌత్యం మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు. రష్యా లేకుండా ఎటువంటి శాంతి చర్చలు జరిపినా అది పూర్తిగా నిరర్ధకమేనని భారత్ వైఖరిని ఆయన వెల్లడించారు.
ఈ సమస్యకు యుద్ధ క్షేత్రంలో పరిష్కారం దొరుకుతుందని భారత్ భావించడం లేదని జైశంకర్ పేర్కొన్నారు. ఏదోఒక దశలో చర్చలు జరగాలన్నారు. ఈ చర్చల్లో ప్రధాన పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ ఉండాలని తెలిపారు. వారికి ఏమైనా సలహాలు, సంప్రదింపులు అవసరమైతే సహకరించేందుకు భారత్ సిద్ధమని పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాస్కో పర్యటన వేళ జైశంకర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన బెర్లిన్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన జర్మనీ సెక్యూరిటీ పాలసీ సలహాదారు జెన్స్ ప్లోట్నెర్తో భేటీ అయ్యారు.