‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’ సంస్థ మద్దతు
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
భారత మూలాలు కలిగిన కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌నకే ‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’ సంస్థ తమ మద్దతు వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు సంస్థ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందూజా ప్రకటన చేశారు. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్‌తో అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని వెల్లడించారు. కమలా హారిస్ వల్ల అవి అస్థిరంగా మారతాయని వ్యాఖ్యానించారు.
”అమెరికాకు కమలా హారిస్ అధ్యక్షురాలు అయితే భారత్‌కు సంబంధించిన అంశాలపై ఆందోళనకరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఉదారవాదుల ఆధిపత్యం ఎక్కువుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా తిప్పి కొట్టే అవకాశం లేకపోలేదు. ఆసియా-అమెరికన్ ఓటర్లపై ప్రభావం పడుతుంది. అదే విధంగా ఇప్పుడున్న బైడెన్-హారిస్ అధికార యంత్రాంగంలోనూ అక్రమ వలసలు భారీగా పెరిగాయి. సరిహద్దు భద్రత ఆందోళనకరంగా ఉంది. నేరాలు, డ్రగ్ స్మగ్లింగ్ పెరిగిపోయాయి. మైనారిటీ కమ్యూనిటీలపై ప్రభావం పడుతుంది. ఇందులో ఆసియా-అమెరికాకు సంబంధించిన బిజినెస్మ్యాన్లు ఉన్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా వస్తే భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. రక్షణ, సాంకేతిక అంశాలకు సంబంధించి భారత్‌కు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీతో ట్రంప్‌నకు మంచి అనుబంధమే ఉంది. చైనా కంటే మనకు ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చే అవకాశమూ ఉంది. హిందూ జనాభా ఎక్కువగా ఉండే జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్, ఆరిజోనా, నెవాడ ప్రాంతాల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేస్తాం. ట్రంప్ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతున్నాం” అని వెల్లడించారు.