ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇబ్బందులు ఎదురౌతున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.
ఓ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, చికెన్ భాషా అనే వ్యక్తి ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోన్ సంభాషణలు హత్యకు గురైన వ్యక్తి కుమార్తె చేతికి చిక్కడంతో ఇప్పుడు కేసు రసవత్తరంగా మారే పరిస్థితి ఎదురైంది.
హత్య కేసులోని ప్రధాన నిందితుడు చికెన్ భాషా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ వాయిస్ కాల్ రికార్డింగ్ ను సాక్ష్యంగా పరిగణించాలని హత్యకు గురైన సాయి ఈశ్వరుడిని కుమార్తె జ్యోతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా కోర్టులో వాదించారు. వాదనలు వినడానికి సమయం లేకపోవడంతో హైకోర్టు సెప్టెంబర్ 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వరుడిని 2014లో దారుణంగా హత్య చేశారు. 2014లోనే కర్నూలు సిటీ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సాయి ఈశ్వరుడిని హత్య చేశారని కేసు నమోదు అయ్యింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చికెన్ భాషా, వైసీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది.
విజయవాడ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఈ కేసులో చికెన్ భాషా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ వాయిస్ కాల్ రికార్డింగ్ ను సాక్ష్యంగా పరిగణించాలని, విట్నెస్ రీకాల్ చేయాలని హత్యకు గురైన సాయి ఈశ్వరుడుని కుమార్తె జ్యోతి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్యోతి దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు తిరస్కరించింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ జ్యోతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జ్యోతి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. సాయి ఈశ్వరుడి హత్య కేసు విచారణ విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ తుదిదశకు చేరుకుందని పిటిషనర్ జ్యోతి తరుపున న్యాయవాది హైకోర్టులో చెప్పారు. ఈ కేసులోని నిందితులు చికెన్ బాషా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాయిస్ డేటా రికార్డు పిటీషనర్ జ్యోతికి లభ్యం అయ్యిందని ఆమె తరపు న్యాయవాది చెప్పారు.
బ్రహ్మోత్సవాలకు ముందే బంఫర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, వైసీపీతో ఉన్న వాళ్లకు చెక్
జ్యోతి దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలోనే మేము హైకోర్టును ఆశ్రయించామని ఆమె తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. విచారణ పూర్తి కాకముందే పిటిషన్ దాఖలు చెయ్యడానికి చట్టం వెసులుబాటు ఇస్తుందని, సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని జ్యోతి తరఫున న్యాయవాది హైకోర్టులో వాదించారు.
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసే అధికారం పిటిషనర్ జ్యోతికి లేదని. ఆమె దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టుకు మనవి చేశారు. కేసు వాదనలు పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్ 5వ తేదీకి పిటిషన్ విచారణ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కె కృపాసాగర్ ప్రకటించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కేసు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.