మళ్లీ పిలుస్తామని వెల్లడి
డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట హాజరైన జోగి రమేష్. చిత్రంలో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరశర్మ, గౌతంరెడ్డి
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి ఇంటిపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బుధవారం సాయంత్రం రమేష్‌ను విచారించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం రమేష్ ఇవ్వలేదన్నారు. ఆయన చెప్పిన సమాధానాలకు తాము సంతృప్తి చెందలేదని స్పష్టం చేశారు. ‘హైకోర్టు జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి సెల్‌ఫోన్, సిమ్ కార్డు ఇవ్వలేమని చెబుతున్నారు. చట్ట ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏ వ్యక్తి నుంచైనా అవసరమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అడిగి తీసుకునే అధికారం పోలీసులకు ఉంది. ఇదే విషయం ఆయనకు చెప్పినా సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ఇవ్వలేదు. అందువల్ల దర్యాప్తు కోసం మళ్లీ పిలుస్తాం’ అని డీఎస్పీ వివరించారు.
గంటన్నర ఆలస్యంగా వచ్చి…
తెదేపా అధినేత ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌కు గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. తాజాగా మంగళవారం హాజరు కావాలని నోటీసులిస్తే ఆయన న్యాయవాదులను పంపించారు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులిచ్చారు. అప్పట్నుంచి వేచి చూడగా సాయంత్రం 5.45 గంటలకు వచ్చిన రమేష్ 6.32 గంటలకు వెళ్లిపోయారు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదు, గుర్తు లేదు అని సమాధానం చెప్పినట్లు తెలిసింది. విచారణ అనంతరం… పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్పానని అంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదని చెప్పి వేగంగా కారెక్కి వెళ్లిపోయారు. విచారణ సమయంలో రమేష్ వెంట మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరశర్మ ఉన్నారు. ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి కూడా విచారణ సమయంలో ఉండగా కొంతసేపటి తర్వాత పోలీసులు బయటికి పంపించారు.