రాయ్‌పుర్: పంద్రాగస్టు సహా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పావురాలను ఎగురవేసి వేడుకలను ప్రారంభించడం భారత్‌లో ఉన్న ఓ సంప్రదాయం. శాంతి, స్వేచ్ఛకు ప్రతీకగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
అయితే, తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ తరహా ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎగరలేని పావురాన్ని తీసుకొచ్చిన బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేశారు ఎస్పీ.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ ముంగేళి జిల్లాలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పన్నూలాల్ మోహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్
అక్కడే ఉన్నారు. ముగ్గురూ శాంతి కపోతాలను ఎగరేసి వేడుకలను ప్రారంభించారు. కానీ, ఎస్పీ వదిలిన పావురం మాత్రం కింద పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ‘పంచాయత్-3’ వెబ్‌సిరీస్‌లోనూ ఇదే తరహా సీన్ ఉందంటూ నెటిజన్లు తాజా ఉదంతాన్ని దానితో పోలుస్తున్నారు.
ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ.. కలెక్టర్‌కు లేఖ రాశారు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ”స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ వేడుకల్లో పావురం కింద పడిపోవడానికి సంబంధించిన వీడియో అన్ని సామాజిక మాధ్యమాలు సహా మీడియాలో ప్రసారమైంది. అనారోగ్యంతో ఉన్న పావురాన్ని తీసుకురావడం వల్లే ఇలా జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమానికి అలాంటి పావురాన్ని తీసుకురావడం సమంజసం కాదు. ఒకవేళ ఇదే గనక ముఖ్యఅతిథిగా ఉన్న ఎమ్మెల్యే చేతుల్లో జరిగి ఉంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. దీనికి బాధ్యులైన అధికారి తన విధులను సరిగా నిర్వర్తించకపోవడం వల్లే ఇలా జరిగింది” అని ఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు. పావురం ఇప్పుడు బతికే ఉన్నట్లు సమాచారం.