శాసనసభ ఎన్నికల ముందు.. జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగా పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే మిగిలిఉంది.
రాంచీ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో జేఎంఎంను వీడుతున్న విషయాన్ని స్పష్టంచేశారు. జెఎంఎంలో తనకు ఎదురైన అవమానాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీని వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు. కోల్హన్ టైగర్‌గా ప్రసిద్ధి చెందిన చంపై సోరెన్ ఎన్నికల ముందు పార్టీని వీడటం జార్ఖండ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తన ముందు మూడు ఆప్షన్ ఉన్నాయన్న చంపై.. ఒకటి రాజకీయాలకు దూరంగా ఉండటం, రెండు సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడం, మూడు ఏదో ఒక పార్టీలో చేరడం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. చంపై ప్రకటన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. చంపై సోరెన్ నేరుగా బీజేపీలో చేరతారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. జార్ఖండ్ మాజీ సీఎం కాషాయ కండువా కప్పుకుని బీజేపీ నాయకుడిగా మారతారా.. లేదా షిండే పాత్ర పోషిస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో చంపై లేనట్లు తెలుస్తోంది.
బీజేపీలోకి వెళ్తారా..?
చంపై సోరెన్ బీజేపీలోకి రావడానికి రెండు అడ్డంకులు ఉన్నాయి. బీజేపీలో ఇప్పటికే బాబు లాల్ మరాండీ, రఘుబర్ దాస్, అర్జున్ ముండా వంటి మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులున్నారు. అలాంటి పరిస్థితిలో చంపై పాత్ర బీజేపీలో ఎలా ఉండబోతుందనేది కీలకం కానుంది. చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు తక్కువ. ఒకవేళ చంపై సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే జెఎంఎం ఈ అంశాన్ని ఎన్నికల్లో ఓ ప్రచారస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. చంపై కాషాయ కండువా కప్పుకుంటే ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఈ ప్రచారం హేమంత్ సోరెన్‌కు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.
షిండే ఫార్ములా
చంపై సోరెన్ తన ప్రకటన తర్వాత ఆయన షిండే ఫార్ములాను ఫాలో అవుతారనే ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలతో కలిసి ఆయన సొంతపార్టీని ఏర్పాటుచేసే అవకాశం ఉందనే చర్చ కూడా కొనసాగుతోంది. అలాగే బిర్సా కాంగ్రెస్, JMM (సోరెన్) మొదలైన పేర్లను కొత్త పార్టీకోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు సొంత పార్టీని పెట్టి.. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తే.. మహారాష్ట్రలో షిండే ఫార్ములాపై ఆయనను బీజేపీ సీఎంను చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంపై బలమైన నాయకుడిగా పరిగణించబడుతున్న కోల్హాన్ ప్రాంతంలో, 2019లో జార్ఖండ్ ముక్తి మోర్చా 14 సీట్లలో 11 గెలుచుకుంది. మొత్తానికి చంపై సోరెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఎన్డీయే కుటుంబానికి స్వాగతం అంటూ హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. మీరు పులి.. పులిగానే మిగిలిపోతారు.. మీకు ఎన్డీయే కుటుంబం స్వాగతం పలుకుతుందంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందన్న చర్చ ఎక్కువుగా వినిపిస్తోంది.