విజయవాడ ఆగస్టు 10 ఆంధ్ర పత్రిక.
అసంబద్ధంగా ఉన్న మార్గదర్శకాలను సవరించి వర్కు అడ్జస్ట్మెంట్ చేయాలని పిఆర్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ,కోసూరి రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన మార్గదర్శకాలలో ఉన్న లోపాలను సవరించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే సర్దుబాటు చేయాలని కోరారు. సర్దుబాటు చేసే ట ప్పుడు సీనియార్టీ విషయంలో స్కూల్ సీనియారిటీ బదులుగా కేడర్ సీనియారిటీ తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా ఇటీవల ఎయిడెడ్ మేనేజ్మెంట్ పాఠశాలల నుండి మండల జిల్లా పరిషత్ లో మెర్జ్ కాబడిన ఉపాధ్యాయులకు మెర్జ్ అయిన తేదీ 27.03.2022 నుండి సీనియారిటీని లెక్కించాలని ,అంతర్ జిల్లాల బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయుల విషయంలో ఎన్టీఆర్ జిల్లాకు వచ్చిన తేదీని పరిగణన లోకి తీసుకోవాలని పై విషయాలలో తేదీలను ధ్రువీకరించుకోవటానికి డి డి వో లు సేవా పుస్తకంతో సరిపోల్చుకొని జాయినింగ్ డేట్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు.సీనియారిటీ నిర్ణయించడానికి ర్యాంకును కూడా పరిగణన లోకి తీసుకోవాలనికోరారు . మొదటగా సీనియర్ కు విల్లింగ్ అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన జీవో 117 ప్రకారం కాకుండా 2020లో విడుదల చేసిన జీవో 53 ద్వారా పని సర్దుబాటు చేయాలని,150 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక పాఠశాలల్లో పిఎస్ హెచ్ఎం పోస్టును అదనపు పోస్టుగా లెక్కించాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయాలలో జరిగే ఉపాధ్యాయుల పని సర్దుబాటు విషయంలో గుర్తింపు గల మండల ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించాలని మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని నవాబ్ జానీ,రాజశేఖర్ తెలిపారు.