హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, బీసీ జనసభ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడం, రోడ్లపై బైఠాయించడం, పోలీసులు వారిని అడ్డుకోవడం, అరెస్టులకు దిగడం సచివాలయ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ తెల్లవారు జాము నుంచే సచివాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది ప్రభుత్వం. ఉదయం 10 గంటల సమయంలో నిరుద్యోగుల వందల సంఖ్యలో సెక్రటేరియట్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. సచివాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.
నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పోలీసుల వలయాన్ని దాటుకుని సచివాలయంలోకి వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, జనసభ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
దీనితో నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడారు. డీఎస్సీని వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్ చేశారాయన.