ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రకాశం జిల్లాలో వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రిజగన్ సమీప బంధువు.. వరుసకు మామ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి..
ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఆయన ఎన్నికలలో ఒంగోలు నుంచి కాకుండా మార్కాపురం లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. జగన్ ఒప్పుకోలేదు. చివరకు బాలినేని అయిష్టంగానే ఒంగోలులో పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన జనసేనలోకి వెళ్ళిపోతున్న ప్రచారం గట్టిగా జరిగింది.
బాలినేని.. జనసేన నుంచి గిద్దలూరులో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఆయన అయిష్టంగా ఒంగోలులో పోటీ చేసి.. దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. ఇదిలా ఉంటే బాలినేని మంచి దోస్త్ అయిన ఒకప్పటి టీడీపీ నేత కరణం బలరాం.. 2019 ఎన్నికలలో చీరాల నుంచి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఎన్నికలలో ఆయన చీరాల నుంచి.. తన తనయుడు కరణం వెంకటేష్‌ను పోటీ చేయించినా ఓడిపోయారు. బాలినేని, కరణం బలరాం ఇద్దరు ఏ పార్టీలో ఉన్న గత రెండున్నర దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా ఉంటారన్న ప్రచారం ఉంది.
ఇక ఇప్పుడు ఇద్దరు వైసీపీ గూటిలోనే ఉన్నారు. పార్టీ ఘోర ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చి జనసేనలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బాలినేని ఇప్పటికిప్పుడు జనసేనలోకి వెళ్లినా.. ఆయనకు లాభం ఏం ఉండకపోవచ్చు. కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా దర్శి లేదా గిద్దలూరు నుంచి జనసేన తరఫున పోటీ చేసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చన్నదే ఆయన వ్యూహం. ఇక కరణం బలరాం తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అయినా టీడీపీలోకి వెళ్లాలని … ఈ క్రమంలోనే జిల్లాకే చెందిన టీడీపీ కీలక నేతల ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.