టీ20 వరల్డ్ కప్‌ను సాధించిన టీమిండియాను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఆటగాళ్లు, కోచ్ సిబ్బంది పోరాట పటిమను కొనియాడాడు. పోగొట్టుకున్న చోటే వెతుకున్నట్లుగా 2007లో ఎదురైన చేదు జ్ణాపకాలు చెరిపేసి, చరిత్ర సృష్టించారని అన్నాడు.
బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.
అయితే వెస్టిండీస్ వేదికగా 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఘోరవైఫల్యం చవిచూసింది. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కానీ 17 ఏళ్ల తర్వాత అదే గడ్డపై భారత్ టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ భారత ఆటగాళ్లను, కోచ్ సిబ్బందిని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ”టీమిండియా జెర్సీలో జత అవుతున్న ప్రతి స్టార్ భారత దేశ పిల్లలకు స్పూర్తి నింపేలా, వాళ్ల కలలు సాకారం చేసుకోవడానికి ప్రేరణలా ఉంటాయి. భారత్‌కు ఇది నాలుగో స్థార్. టీ20 వరల్డ్ కప్ పరంగా ఇది రెండోది”
”వెస్టిండీస్‌లో భారత క్రికెట్ ప్రయాణం ఓ వృత్తంలా సాగింది. 2007 వన్డే వరల్డ్ కప్ వైఫల్యం..2024 నాటికి పవర్హౌస్లా మారి 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచేలా చేసింది. నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ద్రవిడ్ మిస్ అయినప్పటికీ, ఈ టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతను సాయం అపారమైనది. ఇక రోహిత్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్ కెప్టెన్సీ. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధను అధిగమించి, టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ, జట్టు నడిపిన తీరు అమోఘం ”
”ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లి అందుకోవడమే సరైనది.ఈ అవార్డులకు వాళ్లు అర్హులు. కీలక మ్యాచ్‌ల్లో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. ఇక ద్రవిడ్‌తో పాటు పరాస్ మాంబ్రే, విక్రమ్ రాథోర్ కూడా 1996లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఈ 96 బ్యాచ్ ప్రధానపాత్ర పోషించడం గొప్పగా ఉంది. మొత్తంగా ఇది సమష్టి విజయం. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, బీసీసీఐకి అభినందనలు” అని సచిన్ ట్వీట్ చేశాడు.