ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటున్నాయి. ముఖ్యంగా స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. థైరాయిడ్ హార్మోన్ మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా విడుదల అవుతుంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు.
అలా కాకుండా తక్కువగా విడుదల అవుతుంటే గనుక దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఈ సమస్యలు ఉన్న వారు ఆహారంలో కొన్ని మూలికల్ని భాగంగా చేసుకుంటే గనుక ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆ మూలికల వివరాలేంటో కూడా ఇక్కడ వివరిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం చదివేయండి.
నల్ల జీలకర్ర :
నల్ల జీలకర్రను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండటం వల్ల థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యతలు తగ్గుతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గుతాయి. సంబంధిత యాంటీ బాడీలు శరీరంలో తయారవుతాయి.
అతి మధురం :
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖంగా వినిపించే పేరు అతి మధురం. ఇది అన్ని ఆయుర్వేద ఔషధ దుకాణాల్లోనూ చాలా తేలిగ్గా లభ్యం అవుతూ ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కణాలని రక్షిస్తుంది. అలాగే మనలో ఒత్తిడిని కలిగించే కోర్టిసోల్ లాంటి హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. మనం ఎక్కువగా ఒత్తిడిలో ఉండటం వల్ల కూడా థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది.
అల్లం :
హైపో థైరాయిడిజం లక్షణాలు ఉన్న వారు ఎక్కువగా తమ ఆహారాల్లో అల్లం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ఎబీఎస్, లిపిడ్ ప్రొఫైల్ని నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
మునగ ఆకులు :
థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన అసమతుల్యతలు ఉన్నవారు మునగ ఆకుల్ని ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇందులో పాలీఫినాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాక్సిన్, ట్రియడోథైరోనిన్ లాంటి వాటిని ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అందువల్ల జీవ క్రియ మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి.
అశ్వగంధ :
ఆయుర్వేదంలో ఔషధంగా ఎక్కువగా ఉపయోగించే మూలికల్లో అశ్వగంధ ఒకటి. వీటిలో కొన్ని రకాల రసాయనాలతోపాటు, ఆల్కలాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యను తగ్గించడానికి సహకరిస్తాయి.
సేజ్ ఆకులు :
ఆయుర్వేద ఔషధాల్లో సేజ్ మొక్క ఆకుల్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో రోజ్మేరినిక్ యాసిడ్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అందువల్ల ఇది హార్మోన్లను నియంత్రించడంలో శరీరానికి ఎంతగానో సహకరిస్తుంది.
వైద్యుల పర్యవేక్షణలో వీటిని తగినంత మోతాదుగా ఆహారంలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యవంతంగా తయారవుతుంది.